న్యూఢిల్లీ, జనవరి 10: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (UGC-NET) ఫలితాలపై ఎన్‌టీఏ కీలక ప్రకటన వెలువరించింది. యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఫలితాలు జనవరి 10 (బుధవారం)న ప్రకటించాల్సి ఉంది. అయితే ఇటీవల చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను తలెత్తడంతో.. అక్కడి అభ్యర్థులకు మరోమారు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చేత జనవరి 17న ఫలితాలు విడుదల చేయాలని ఎన్‌టీఏ నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ మేరకు తెలియజేసింది.
కాగా దేశంలోని పలు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి యూజీసీ నెట్ తప్పనిసరనే విషయం తెలిసిందే. లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 6 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో నెట్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 292 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కరీనగర్‌లోని చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానాచార్యులు పి మంగతాయారు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 20న జరగనుంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని ఆమె తెలిపారు. మొత్తం 80 సీట్లకుగాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7105 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రవేశ పరీక్షకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 94903 95216, 99667 59402, 90304 26686 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విద్యార్ధులకు సూచించారు. దరఖాస్తు ఏవైనా తప్పులు దొర్లితే జనవరి 16లోగా సరి చేసుకోవాలని కోరారు. సీట్ల కేటాయింపు పూర్తి పారదర్శకతతో ఉంటుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.