
ఉపాధ్యాయులుగా విద్యా రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET)ల్లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 86 సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి, M.Ed అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 50 శాతంగా నిర్ణయించారు. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు M.Ed. అర్హత తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 29, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద OC/BC అభ్యర్థులు రూ.1,000, SC/ ST/ PwD అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దీనితోపాటు అదనంగా పరీక్ష ఫీజు రూ.120 చొప్పున ప్రతి ఒక్కరూ చెల్లించాలి. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష (CBRT/OMR) ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి సీనియర్ లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు, లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష నవంబర్ 2026లో ఉంటుంది. ఉపాధ్యాయ విద్యా రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి, అర్హత కలిగిన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.