TG TET 2025 Application: నేటి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2025 ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సారి..

TG TET 2025 Application: నేటి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?
TG TET 2025 Application

Updated on: Apr 15, 2025 | 7:00 AM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2025 ) 2025 నోటిఫికేషన్‌ ఏప్రిల్ 11 (శుక్రవారం)న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానం మేరకు రేవంత్‌ సర్కార్ ఈ ఏడాదికి మొదటి సెషన్‌ టెట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టెట్ రాత పరీక్ష జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల విధానంలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌ పరీక్ష 2.30 గంటలపాటు నిర్వహిస్తారు.

టెట్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్షకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే వారు రాయవల్సి ఉంటుంది. వీరు ఇంటర్‌ పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డైట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇక పేపర్ 2 పరీక్ష ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులకు బోధించేందుకు నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతోపాటు బీఎడ్‌ లేదా స్పెషల్ బీఎడ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు చెందిన వారు 45 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. డీఎస్సీ నియామక పరీక్ష రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే ఈ పరీక్ష నిర్వహించిన ప్రతీసారీ పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు పోటీ పడుతుంటారు.

టెట్‌ పేపర్‌ 1 లేదా పేపర్ 2కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.750 దరఖాస్తు సమయంలో చెల్లించవల్సి ఉంటుంది. ఇక రెండు పేపర్లు రాసేవారు రూ. 1000 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. డీఎడ్‌, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులతోపాటు కొత్తగా సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌కు హాజరవుతున్నారు. వీరికి పదోన్నతులు కావాలంటే వారంతా టెట్‌ తప్పనిసరిగా పాసై ఉండాలి. ఇక టెట్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకే సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us