
హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (టీజీ ఐసెట్) 2026 దరఖాస్తు గడువు మార్చి 16తో ముగిసింది. అయితే ఈ గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా పొడిగించింది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు ఎలాంటి ఆసల్య రుసుము లేకుండా మార్చి 23, 2026వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.550 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఈ ఏడాదికి ఐసెట్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఎంబీఏ ప్రవేశాలకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసీఏ ప్రవేశాలకు ఇంటర్ లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఓ సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఇక ఐసెట్ ఆన్‌లైన్ పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ప్రాథమిక కీ మే 29న విడుదల చేస్తారు. ఇక ఐసెట్ తుది ఫలితాలు జూన్ 19, 2026వ తేదీన వెల్లడవుతాయి.
తెలంగాణ ఐసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్-2026 దరఖాస్తు గడువు మంగళవారం (మార్చి 17)తో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17వ తేదీ ముగింపు సమయంలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3,2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.