Anganwadi Jobs: అంగన్‌వాడీల్లో 14,236 పోస్టులతో కొలువుల జాతర..! ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో బిగ్ జాబ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయబోతుంది. మొత్తం పోస్టుల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రంలని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్, హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ప్రస్తుతం ఉన్నవారిలో కొందరికీ సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. మరోవైపు దాదాపు 3,914 మంది 65 ఏళ్ల వయసు నిండి పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులనూ నోటిఫికేషన్లో కలిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉంటే సరిపోయేది. కానీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాసై ఉండాలన్న నిబంధన పెట్టారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. అలాగే కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50 శాతం సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో ఇంటర్మీడియట్ పాసైన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి.