CUET 2022 రద్దుకు శాసనసభ తీర్మానం.. కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్ధన!

|

Apr 12, 2022 | 5:05 PM

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నిర్వహణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ సోమవారం (ఏప్రిల్‌ 11) ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది..

CUET 2022 రద్దుకు శాసనసభ తీర్మానం.. కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్ధన!
Cuet 2022
Follow us on

Stalin Govt Request Centre to withdraw CUET 2022: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నిర్వహణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ సోమవారం (ఏప్రిల్‌ 11) ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభలో దీనికి సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఏప్రిల్‌ 11న ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పాఠ్య ప్రణాళిక మేరకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాష్ట్ర పాఠ్య ప్రణాళికలతో చదివిన విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని సీఏం అభిప్రాయపడ్డారు. కాగా దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 2022-2023 విద్యా సంవత్సరం నుంచి సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా మాత్రమే నిర్వహించనున్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే CUET, NEET వంటి పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న పాఠశాల విద్యా వ్యవస్థలను పక్కదారి పట్టిస్తోందని, శిక్షణా కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేందుకు, యువతను మానసిక ఒత్తిడికి గురిచేసేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సిలబస్‌పై ఆధారపడిన ఏ ప్రవేశ పరీక్ష అయినా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర బోర్డ్ సిలబస్‌లలో చదివిన విద్యార్థులందరికీ సమాన అవకాశాన్ని అందించదని సభ భావించింది. చాలా రాష్ట్రాల్లో 80% కంటే ఎక్కువ మంది విద్యార్థులు స్టేట్ బోర్డ్ సిలబస్ అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ఈ విద్యార్థులంతా అట్టడుగు వర్గాలకు చెందినవారు. అందువల్ల ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారిత ప్రవేశ పరీక్ష ద్వారా సెంట్రల్ యూనివర్శిటీల్లో అడ్మిషన్ పొందడం అనేది ఎస్సీఈఆర్టీ సిలబస్ చదివిన విద్యార్ధులకు ప్రతికూలమైనదని సభ పేర్కొంది. ఈ తీర్మానం తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని, తమిళనాడు రాష్ట్రంలోని 8.5 కోట్ల మంది ప్రజల తరపున, CUETని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సందర్భంగా తెలియజేశారు.

కాగా ఇప్పటికే సీయూఈటీ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఐతే పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం సీయూఈటీ రద్దును కోరడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

Also Read:

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022లో ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు