
హైదరాబాద్, సెప్టెంబర్ 21: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను ప్రకటించింది. CEN No. 01/2026 కింద చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో భాగంగా CBT-1 పరీక్షలను 2026 నవంబర్ 3 నుంచి 5 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు RRB వెల్లడించింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థుల ఎంపికలో తొలి దశగా Computer Based Test (CBT-1) నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే రీజియన్ పరిధిలో మొత్తం 1420 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ రీజియన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రం వివరాలను అధికారికంగా విడుదల చేసే సిటీ ఇంటిమేషన్, అడ్మిట్ కార్డుల ద్వారా తెలుసుకోవచ్చు.
అభ్యర్థులకు పరీక్ష కేంద్రం ఉన్న నగరం వివరాలను తెలిపే City Intimation Slipను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు అందుబాటులోకి తీసుకురానున్నట్లు RRB తెలిపింది. అలాగే Admit Card/e-Call Letterను పరీక్షకు 4 రోజుల ముందు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ అయి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం తమ ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రం, సమయం, అడ్మిట్ కార్డు వంటి వివరాలను ముందుగానే పరిశీలించి, పరీక్షకు అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి కేంద్రానికి చేరుకోవాలి.