ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు! సర్కార్ సరికొత్త ప్లాన్..

TOSS Opportunity for Failed SSC Students: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. సప్లిమెంటరీ తర్వాత కూడా ఫెయిల్ అయిన విద్యార్థులకు TOSS ద్వారా మరోసారి పరీక్షలు నిర్వహించి పై చదువులకు అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. మార్చి, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కలుపుకొని మొత్తం ఉత్తీర్ణత శాతం 99.10కు చేరింది..

ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు! సర్కార్ సరికొత్త ప్లాన్..
Telangana SSC Results

Updated on: Jun 29, 2026 | 3:50 PM

హైదరాబాద్‌, జూన్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం యేటా పురోగమన దిశలో సాగుతుంది. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం యేటా వంద శాతానికి చేరువవుతోంది. గతేడాది కంటే ఈసారి మార్చి పరీక్షల ఫలితాల్లో రికార్డు స్థాయిలో 95.15 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇక తాజాగా విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలతో కలుపుకొంటే పదో తరగతిలో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సప్లిమెంటరీలోనూ గట్టెక్కలేకపోయిన వారిని తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ద్వారా ఉత్తీర్ణులు చేయించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో విద్యార్ధులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఇంటర్, తత్సమాన కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తానికి ఒకటి, రెండేళ్లలో పదో తరగతి పరీక్షలు రాస్తే తప్పిన వారంటూ ఇక ఉండరని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 92.78 శాతం ఉత్తీర్ణత సాధించగా… ఈసారి ఏకంగా 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలో మాత్రమే అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మరో 6,106 మంది విద్యార్ధులు పదో తరగతిలో తప్పారు. ఇక సప్లిమెంటరీ పరీక్షల తర్వాత కూడా తప్పినవారికి ‘టాస్‌ (TOSS)’ ద్వారా జులైలో పరీక్షలు నిర్వహించి, వారంతా పాస్‌ అవడానికి మరో అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే.. రెండు సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకొని.. మిగిలిన వాటికి మాత్రమే పరీక్షలు రాయొచ్చు. మినహాయింపు సబ్జెక్టులను కూడా పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్ల పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పాసైతే వారు కూడా ఇంటర్‌లో ఇదే ఏడాది పైచదువుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

2026 మార్చిలో 5,16,815 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాస్తే.. ఇందులో 4,91,774 పాస్‌ అయ్యారు. సుమారు 25,041 మంది తప్పారు. ఇక అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 24,028 మంది హాజరైతే.. 20,423 మంది ఉత్తీర్ణత పొందారు. రెగ్యులర్, సప్లిమెంటరీలో కలిపి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,12,197 మంది విద్యార్ధులు పదో తరగతి పాస్‌ అయ్యారు. అంటే మొత్తం ఉత్తీర్ణత శాతం 99.10% అన్నమాట. సప్లిమెంటరీ ముగిశాక కూడా 4,618 మంది ఆయా సబ్జెక్టుల్లో తప్పారు. ఇందులో అసలు పరీక్షలకు హాజరుకాని వారు 1,013 మంది వరకు ఉన్నారు. వీరంతా TOSS ద్వారా మరో మారు పదో తరగతి పరీక్షలకు హాజరైతే వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యే అవకాశం ఉంది.

Follow Us