Pariksha Pe Charcha 2026: ‘పరీక్షలు పండుగలా చేయండి’.. పరీక్షాపే చర్చాలో విద్యార్థులకు ప్రధాని సూచనలు..

పరీక్షల ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో నిర్వహించిన ‘పరీక్షాపే చర్చా’లో ప్రధాని మోదీ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. చదువు-విశ్రాంతి మధ్య బ్యాలెన్స్, ఇంటర్నెట్ టైమ్ వృథా చేయొద్దు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలంటూ చెప్పారు. ఈ కార్యక్రమ వీడియోను మోదీ ఎక్స్‌లో షేర్ చేశారు.

Pariksha Pe Charcha 2026: ‘పరీక్షలు పండుగలా చేయండి.. పరీక్షాపే చర్చాలో విద్యార్థులకు ప్రధాని సూచనలు..
Pariksha Pe Charcha 2026

Updated on: Feb 06, 2026 | 12:01 PM

పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి.. కొత్త ఉత్సాహాన్ని నింపే లక్ష్యంతో నిర్వహించే ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించి.. వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. “పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది” అని మోదీ పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని కూడా సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన మోదీ.. తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని ఆసక్తికరంగా చెప్పారు. “నేను ప్రధానిని అయ్యాను. పనితీరు గురించి ప్రజలు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అన్నింటినీ వినాలి. కానీ అందులో మనకు సరిపోయేదే ఎంచుకోవాలి. నేను కూడా కొన్ని సూచనలు తీసుకుని మార్పులు చేసుకున్నాను. నా విలువలను మాత్రం వదులుకోలేదు” అని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య అంశాలపై కూడా మోదీ మాట్లాడారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలు అన్నింటికీ సరైన బ్యాలెన్స్ ఉంటేనే ఎదుగుదల సాధ్యమని సూచించారు. మోదీ విద్యార్థులకు మరో ముఖ్య సూచన చేశారు. ఆటలు ఆడటం కూడా ఓ స్కిల్.. వాటిని సరదాగా మాత్రమే చూడొద్దు.. అలాగే జూదం, బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దని సూచించారు. బెట్టింగ్‌లపై దేశంలో చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇంటర్నెట్‌ చౌకగా లభిస్తోందని.. సమయాన్ని వృథా చేసుకోకూడదని సూచించారు. గతం దగ్గరే ఆగిపోకుండా.. ముందున్న లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. పరీక్షలను భయంగా కాకుండా పండుగలా మార్చుకోవాలని,ఇతరులతో కాదు.. మీతో మీరు పోటీపడాలని మోదీ సూచించారు. ఈ ఏడాది ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 4.5 కోట్ల మంది రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us