
National Testing Agency (NTA) నిర్వహిస్తున్న NEET (UG) 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు ప్రత్యేకంగా రీఫండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే అని NTA స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి ప్రవేశించి, అక్కడ కనిపించే “Refund Link” పై క్లిక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి.
ఖాతా వివరాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు అభ్యర్థులు అవసరమైతే రద్దు చేసిన చెక్కు (Cancelled Cheque) ను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత అవే తుది వివరాలుగా పరిగణించబడతాయి. అనంతరం ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని NTA వెల్లడించింది.
NEET (UG) 2026 Re-Examination ను NTA జూన్ 21, 2026 (ఆదివారం) నిర్వహించనుంది.
గతంలో నిర్వహించిన NEET-UG పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్, అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సీబీఐ సహా పలు దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో పునఃపరీక్షను ప్రకటించారు.