
జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్ష–పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) 2026 పరీక్ష ఆదివారం (ఆగస్టు 30) దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కీలక పరీక్షకు దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద సందడి
అభ్యర్థులను ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఆధార్ ఆధారిత ధృవీకరణతో పాటు అవసరమైన గుర్తింపు తనిఖీలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా NEET-PG అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. అదనంగా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఏపీలో 76 పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో NEET-PG పరీక్షకు సుమారు 18,700 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు తెలంగాణలో నీట్ పీజీ పరీక్ష కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో 4, రంగారెడ్డిలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచే ప్రధాన జంక్షన్ల వద్ద రద్దీ పెరగనున్న నేపథ్యంలో కీలక పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు.
మరోవైపు హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో షేక్‌పేట్ జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే పరీక్షార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే బయలుదేరాలని, అత్యవసర సమాచారం కోసం 90102-03626 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
#HYDTPinfo
🚦 Traffic Advisory | NEET-PG Examination 2026Commuters, please make a note of the Traffic Advisory in connection with the NEET-PG Examination 2026 being conducted at various centres in Hyderabad on 30.08.2026.
⏰ Expected time of moderate traffic congestion: 09:00… pic.twitter.com/KeaB6T5SXy
— Hyderabad Traffic Police (@HYDTP) August 29, 2026
4 గంటల పాటు జామర్లు.. మొబైల్ నెట్‌వర్క్‌పై నిఘా!
ఇక, కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణ సంస్థ TCS ఆధ్వర్యంలో స్థానిక పోలీసుల సహకారంతో అభ్యర్థుల తనిఖీలు చేపట్టనున్నారు. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. పరీక్ష సమయంలో సుమారు నాలుగు గంటల పాటు జామర్లు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాస్ కాపీయింగ్ లేదా ప్రశ్నపత్రం లీక్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోలీస్ సైబర్ విభాగాలు కూడా రంగంలోకి దిగాయి.
AI గ్లాసెస్‌పైనా ప్రత్యేక నిఘా
సాధారణ మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్లు, పేజర్లు మాత్రమే కాకుండా కొత్త తరహా సాంకేతిక పరికరాలపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు, స్పై కెమెరాలు, AI ఆధారిత స్మార్ట్/మెటా గ్లాసెస్ వంటి పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకుండా కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు. నిషేధిత వస్తువులను భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక స్టోరేజ్ సదుపాయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల అభ్యర్థులు అవసరం లేని వస్తువులను కేంద్రానికి తీసుకురాకపోవడం ఉత్తమం.
డ్రెస్ కోడ్ తప్పనిసరి!
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు దుస్తుల విషయంలోనూ నిబంధనలు పాటించాలి. పురుష అభ్యర్థులు సాధారణ ట్రౌజర్లు, ప్యాంట్లు లేదా జీన్స్ ధరించాలని, బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని సూచించారు. టోపీలు, మఫ్లర్లు లేదా తల కప్పుకునే ఇతర వస్తువులను అనుమతించరు. మహిళా అభ్యర్థులు లెగ్గింగ్స్, ప్యాంట్లు, సాధారణ చెప్పులు ధరించాలని సూచించారు. హ్యాండ్‌బ్యాగ్, పర్స్ వంటి వాటిని పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని అధికారులు తెలిపారు. మెహందీ వంటి వాటిపైనా నిబంధనలు ఉన్నందున అభ్యర్థులు అడ్మిట్ కార్డులోని సూచనలను ముందుగానే పూర్తిగా చదవాలని సూచించారు.
పరీక్ష తర్వాత పేపర్ విశ్లేషణ
పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థులు ప్రశ్నపత్రంపై విశ్లేషణ కోసం ఆసక్తిగా ఎదురుచూడనున్నారు. NBEMS సాధారణంగా అధికారిక Answer Key విడుదల చేయదు. అయితే పరీక్ష అనంతరం వివిధ కోచింగ్ సంస్థలు తమ నిపుణుల ఆధారంగా అనధికారిక సమాధానాలను విడుదల చేసే అవకాశం ఉంది. NEET-PG 2026కు సంబంధించిన అధికారిక సమాచారం, పరీక్ష మార్గదర్శకాలు, అడ్మిట్ కార్డు, ఫలితాలు తదితర వివరాల కోసం అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్లోని తాజా నోటిఫికేషన్లను మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలి.
మొత్తంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్ష కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైబర్ భద్రత నుంచి భౌతిక తనిఖీల వరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో.. NEET-PG 2026 పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా మారింది.
మరిన్ని కెరీర్ – ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..