
అమరావతి, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు మొదటి విడత ప్రవేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని మరికొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అన్నా గౌరి ప్రైవేటు వైద్య కళాశాలలో 100 సీట్లకు అనుమతులు జారీ కాగా.. దీనితో పాటు నంద్యాల శాంతిరామ్ కాలేజీలో సీట్లను 150 నుంచి 200కు పెంచారు. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలోనూ ప్రస్తుతం ఉన్న 120 సీట్లను 150కి పెంచినట్లు ఎన్‌ఎంసీ తాజాగా వెల్లడించింది. రాజమహేంద్రవరం, చినకాకాని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మరో 50 సీట్లకు అనుమతులు వస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, పీజీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీసెట్ కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తాజా మార్పుల వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 17 వరకు జరగనుంది. సెప్టెంబర్ 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక వెబ్ ఐచ్ఛికాలకు సెప్టెంబరు 20 వరకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 23 నుంచి 25లోపు చేరాల్సి ఉంటుందని చెప్పారు. ఇక దివ్యాంగులు, ఎన్‌సీసీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎవిఎస్ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్హత పత్రాల తనిఖీ, వెబ్ ఐచ్ఛికాల నమోదు గడువును సెప్టెంబరు 18 వరకు పెంచినట్లు తెలిపారు. సెప్టెంబర్ 20న సీట్ల కేటాయింపు, 22న తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.