
హైదరాబాద్, అక్టోబర్ 1: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ సీట్ల భర్తీకి త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. యేటా జేఈఈ మెయిన్స్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి తొలి విడత జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలకానుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ కూడా అక్టోబరులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే నెలల్లో పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సెప్టెంబరు 29న స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష 2026 జనవరిలో, సెషన్ 2 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. తొలి విడత ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ నెలలో ప్రారంభవుతాయని వెల్లడించింది. అయితే దరఖాస్తు విధానంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా NTA కొన్ని సూచనలు జారీ చేసింది. అవేంటంటే..
ఆధార్ కార్డులో పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ ఉండాలి. తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆధార్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈడబ్ల్యూఎస్, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగుల ధ్రువపత్రాలను కూడా అప్‌డేట్ చేసుకోవడం లేదంటే రెన్యువల్ చేయడం వంటివి చేసుకోవాలని కోరింది.
జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా యేటా దాదాపు 14లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తుంటారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 2.50 లక్షల మంది ఉంటారు. ఎన్టీయే మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా సంబంధిత ద్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని ఈ మేరకు సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.