How to edit TSPSC one-time registration: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)కు నమోదు చేసుకున్న అభ్యర్ధుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు, సవరణలకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించనుంది. అందుకు సంబంధించిన కార్యచరణకూడా పూర్తి చేసింది. 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు అప్‌గ్రేడ్ చేసేందుకు అవకాశం కల్పించడానికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను రెండ్రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా కొత్త ఉద్యోగార్థులు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా 1-7వ తరగతి వరకు వ్యక్తిగత వివరాల నమోదుతో పాటు విద్యార్హతలు మార్చుకునేందుకు, వాటిని అప్‌లోడ్ చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఐతే ఓటీఆర్ ఎడిట్ (TSPSC OTR Edit Option) సమయంలో ఉద్యోగార్థులు ఇప్పటికే నమోదు చేసిన ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ వివరాలను మార్చడానికి అవకాశం ఉండదు. ఇప్పటివరకు ఓటీఆర్‌లో ఈ-మెయిల్ వివరాలు నమోదుచేయని అభ్యర్థులకు మాత్రం ఎడిట్ సమయంలో ఈ మెయిల్ వివరాలు నమోదుకు అవకాశం కల్పించనుంది. కాగా టీఎస్‌పీఎస్సీలో ఇప్పటికే 25 లక్షల మంది ఉద్యోగార్థులు తమ పేర్లను ఓటీఆర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
గతంలో పది జిల్లాల ప్రాతిపదికన 4 నుంచి 10వ తరగతి వరకు వివరాలు నమోదు చేశారు. నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికతలో మార్పునకు.. 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు నమోదు చేయవల్సి ఉంది. ఒకటి నుంచి ఏడోతరగతి వరకు ఏ జిల్లాలో చదువుతారో ఆ ప్రకారంగానే స్థానికత నిర్ధరణ జరుగుతుంది. ఈ మేరకు కొత్తసాఫ్ట్‌వేర్ ద్వారా ఈ మార్పులు చేసుకోవడానికి అవకాశదం కల్పిస్తోంది. వీటితోపాటు అదనపు అర్హతలు, ఆదాయ వివరాలు నమోదు చేసేందుకు అవకాశాన్నిస్తోంది. ఈ విధమైన సమాచారం అప్‌లోడ్ చేయడం ద్వారా పోస్టులకు ఎంపికకు, దరఖాస్తుకు, ఎంపిక అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలనపుడు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉంటాయని కమిషన్ భావిస్తోంది.
కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక ఓటీఆర్‌లో వివరాల అప్‌డేషన్‌కు నిరంతరం అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటీఆర్‌లో వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఉద్యోగ నియామక సమయంలోనూ స్థానికత నిర్ధారణ విషయంతో అవే తప్పులు దొర్లుతాయి. అందుకే ఎడిట్ టైంలో క్షుణ్ణంగా వివరాలను సరిచూసుకుని నమోదు చేయాలని కమిషన్ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు సమయంలో ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్‌లోకి వెళ్లిన తర్వాత సరైన వివరాలను నమోదు చేసి ప్రివ్యూ చూసుకుని.. అంతా సరిగ్గానే ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే సబ్‌మిట్ బటన్ నొక్కాలని ఈ సందర్భంగా కమిషన్ వర్గాలు సూచనలు జారీ చేశాయి.
Also Read: