
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్విస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 37 భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత కలిగిన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్టోబర్ 27, 2026వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. హార్టికల్చర్ రంగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నియామకం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఒక అవకాశం కానుంది. అభ్యర్థుల ఎంపికలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, పేపర్-2 హార్టికల్చర్-1, పేపర్-3 హార్టికల్చర్-2 నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. మూడు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షతో పాటు అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పూర్తి అర్హతలు, నిబంధనలు, ఇతర వివరాలను పరిశీలించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు వేతనం లభిస్తుంది.