అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 సర్వీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ గడువు తేదీని పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలియజేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు ఈ రోజుతో (జనవరి 10) ముగియనుంది. అయితే తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో 897 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
కాగా ఏపీపీఎస్సీ జారీచేసిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూప్ 2 పోస్టులకు డిసెంబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 10వ తేదీతో తుది గడువు ముగియనుంది. అయితే దరఖాస్తుదారులకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు వెబ్‌సైట్ అసలు తెరుచుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మరికొన్ని సార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన తర్వాత.. పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తోందని అంటున్నారు. దీంతో వివరాల నమోదు ప్రక్రియ మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. ఏకకాలంలో అధిక మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది. దీంతో గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో వారు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ తాజాగా దరఖాస్తు గడువును జనవరి 17వ తేదీ ఆర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నేటితో (జనరరి 10) గడువు ముగుస్తోంది. తాజాగా ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపులకు జనవరి 10వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్‌గౌర్ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. రూ.2,500 అపరాధ రుసుముతో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులు ఈ రోజు ముగింపు సమయంలోపు పరీక్షఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.