
అమరావతి, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షల విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్షకు సివిల్ సర్వీసెస్‌లో మాదిరి రెండు పేపర్లకు నిర్వహిస్తున్నారు. ఒక్కో పేపర్ 120 మార్కులకు మొత్తం 240 మార్కులకు ఈ పరీక్ష ఉంటోంది. అయితే ఇకపై ప్రిలిమినరీ పరీక్షను ఒక్క పేపర్‌తోనే నిర్వహించాలని కమిషన్ భావిస్తుంది. అలాగే మెయిన్స్‌లో అర్హత పరీక్షలుగా ఉన్న తెలుగు, ఇంగ్లిస్ ల్యాంగ్వేజ్ సబ్జెక్టులకు రెండు పేపర్లకు బదులు ఒక్క పేపర్‌గానే 150 మార్కులకు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రశ్నపత్రంలో 75 మార్కుల చొప్పున రెండు విభాగాలుగా ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగంలో కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్దం చేసిన కమిషన్ ప్రభుత్వం ఆమోదానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం ఇస్తే ఇకపై వచ్చే గ్రూప్1 నోటిఫికేషన్లకు కొత్త విధానం అమల్లోకి వర్తింపజేయనుంది.
ఇప్పటి వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ అప్టిట్యూడ్ విధానంలో రెండు పేపర్లకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ రెండు పేపర్లను కలిపి ఒక్కటిగానే నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్రతిపాదించింది. అలాగే 240 మార్కుల నుంచి రెండు పేపర్లకు కలిపి 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అంటే ఇందులో మొత్తం 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయంలో 150 మార్కులకు పరీక్ష ఉంటుందన్నమాట.
భారత చరిత్ర, భారత రాజ్యాంగం- రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ- ప్రణాళిక, భారతీయ- ప్రపంచ భూగోళశాస్త్రం, శాస్త్ర, సాంకేతిక- పర్యావరణం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కరెంట్ ఎఫైర్స్, ఆప్టిట్యూడ్ అంశాలకు 20 మార్కుల చొప్పున మొత్తం 140 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మిగిలిన 10 మార్కులకు డేటా వివరణకు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. స్క్రీనింగ్‌లో ప్రతి తప్పునకు 1/3 మార్కుల చొప్పున మైనస్ చేస్తారు. మెయిన్స్‌లో పేపర్ 3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా, పేపర్ 5లోని సైన్స్ అండ్ టెక్నాలజీకి అదనంగా ‘పర్యావణ సమస్యలు’ అంశాన్ని జోడించాలని ప్రతిపాదించింది. మెయిన్స్ ఐదు పేపర్లకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లే 75 మార్కులకు ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.