తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, 30వ తేదీ అర్థరాత్రి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 30ని చివరి తేదీగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే మొదట నోటిఫికేషన్‌లో భాగంగా 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్ మాత్రం 8039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
మొత్తం 1129 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తొలగించారు. దీంతో ఈ అంశం కాస్త నిరుద్యోగుల్లో గందరగోళానికి గురి చేసింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతూ పోతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన రోజు పెద్దగా అప్లికేషన్స్ రాలేవు అయితే డిసెంబర్ 31వ తేదీన 19,535 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 1వ తేదీ 13,324 దరఖాస్తులు, జనవరి 2 న 40,762 దరఖాస్తులు, జనవరి 3 న 30,262 దరఖాస్తులు, జనవరి 4 న 31,438, జనవరి 5 వ తేదీ 19,700 దరఖాస్తులు వచ్చాయి. దీంతో వారం రోజుల్లో మొత్తం 1,55,022 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల స్వీకరణకు ఇంకా చాలా రోజులు సమయం ఉండడంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు రూ. 280 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కాగా రూ. 80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు మాత్రమే రూ. 80 పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారు రూ. 200 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌స్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..