Electric Vehicle Charging Station: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు కస్టమర్లు. అందుకు తగినట్లుగానే పలు వాహనాల సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ తప్పనిసరి. ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే అంత మంచిది. ఈవీ కొనుగోలుదారులను ప్రధానంగ వేధించే ప్రశ్న ఏదైనా ఉంది అంటే? అది మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కంపెనీలు, రాష్ట్రాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల సమస్యలను తగ్గించడానికి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం స్పితి జిల్లాలోని కాజాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనీసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా కాజా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మహేంద్ర ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ కాజాలో ఉంది. ఇది 500 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఇక్కడ మొదటి స్టేషన్. ఈ ఛార్జింగ్ స్టేషన్‌కు మంచి స్పందన లభిస్తే, మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాము. ఇది వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.. అని అన్నారు. ఈ రోజు ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ వాహనంపై మనాలి నుంచి కాజాకు వచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల ఈ రోజుల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే వాయువుల ఉద్గారం ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి అని ఆయన అన్నారు.
కాగా, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్న కంపెనీలు ప్రతి చోట ఛార్జింగ్ స్టేషన్‌లు ఉండేలా చర్యలు చేపడుతున్నాయి. వాహనదారులకు ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడంలో చర్యలు చేపడుతున్నాయి.