కొన్ని రైల్వే స్టేషన్ల పేరులో జంక్షన్, రోడ్, టెర్మినల్, క్యాంట్ ఎందుకుంటుంది? 99 శాతం మందికి తెలియదు

విజయవాడ జంక్షన్, భద్రాచలం రోడ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్.. ఈ రైల్వే స్టేషన్ల పేర్లు ఎందుకు ఇలా ఉంటాయని ఎప్పుడైన ఆలోచించారా? అసలు జంక్షన్, టెర్మినల్, రోడ్, క్యాంట్ వీటికి అర్థాలు, వాటి మధ్య తేడాలు ఏంటో తెలుసా? ఈ ఆర్టికల్ చదివేయండి పూర్తిగా తెలిసిపోతుంది..

కొన్ని రైల్వే స్టేషన్ల పేరులో జంక్షన్, రోడ్, టెర్మినల్, క్యాంట్ ఎందుకుంటుంది? 99 శాతం మందికి తెలియదు
Indian Railways

Updated on: Jul 23, 2026 | 4:59 PM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా స్టేషన్ బోర్డులను గమనించినప్పుడు కొన్ని స్టేషన్ల పేర్ల చివర జంక్షన్, టెర్మినల్, క్యాంట్, రోడ్ వంటి పదాలు కనిపిస్తుంటాయి. అయితే ఇవి కేవలం పేరులో భాగమేనా? లేక వీటి వెనుక ప్రత్యేకమైన అర్థం ఉందా? వాస్తవానికి, ఈ పదాలు ఆయా స్టేషన్ల స్వభావాన్ని, రైల్వే నెట్‌వర్క్‌లో వాటి పాత్రను సూచిస్తాయి.

టెర్మినల్ అంటే..

ఒక రైల్వే స్టేషన్ పేరుకు టెర్మినల్ అనే పదం ఉంటే, ఆ మార్గంలో రైల్వే లైన్ అక్కడితో ముగుస్తుందని అర్థం. అంటే ఆ స్టేషన్ దాటి అదే ట్రాక్‌పై రైలు ముందుకు వెళ్లదు. అక్కడి నుంచి రైలు తిరిగి వెనక్కి ప్రయాణించాలి లేదా మరో మార్గంలో కొనసాగాలి. అందుకే ఇలాంటి స్టేషన్లను టెర్మినల్ స్టేషన్లు అంటారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్, ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి స్టేషన్లు దీనికి మంచి ఉదాహరణలు. అనేక దూర ప్రయాణ రైళ్లు ఈ స్టేషన్ల నుంచే ప్రారంభమై, అక్కడే తమ ప్రయాణాన్ని ముగిస్తాయి.

జంక్షన్ అంటే..

జంక్షన్ అనేది కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ దిశలకు రైల్వే మార్గాలు విడిపోయే స్టేషన్. అంటే ఒకే స్టేషన్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందువల్ల జంక్షన్లు రైల్వే నెట్‌వర్క్‌లో కీలక కేంద్రాలుగా పరిగణించబడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ జంక్షన్, కాజీపేట్ జంక్షన్, డోర్నకల్ జంక్షన్, అలాగే ఇతర రాష్ట్రాల్లో మధుర జంక్షన్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ వంటి స్టేషన్లు అనేక ప్రధాన రైల్వే మార్గాలను అనుసంధానిస్తాయి.

చాలామంది ఎక్కువ రైళ్లు వచ్చే స్టేషన్‌ను జంక్షన్‌గా భావిస్తారు. కానీ అలా కాదు. ఒక స్టేషన్ ఎంత పెద్దదైనా, ఎంత రద్దీగా ఉన్నా, అక్కడి నుంచి కనీసం మూడు వేర్వేరు రైల్వే మార్గాలు విడిపోకపోతే దానిని జంక్షన్‌గా పిలవరు. అందుకే దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పేరులో జంక్షన్ అనే పదం ఉండదు.

ఫొటో: పలు రైల్వే స్టేషన్ల బోర్డులు

క్యాంట్ అంటే..

కొన్ని స్టేషన్ల పేర్లలో కనిపించే క్యాంట్ అనేది కంటోన్మెంట్ అనే పదానికి సంక్షిప్త రూపం. బ్రిటిష్ పాలనలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేశారు. సైనికుల రాకపోకలు, సామగ్రి రవాణా సులభంగా ఉండేందుకు ఆ ప్రాంతాల సమీపంలో రైల్వే స్టేషన్లు నిర్మించారు. అందుకే ఢిల్లీ క్యాంట్, అంబాలా క్యాంట్, మీరట్ క్యాంట్, ఝాన్సీ క్యాంట్ వంటి స్టేషన్ల పేర్లలో ఈ పదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్లు సాధారణ ప్రయాణికులకు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.

రోడ్ అంటే..

రైల్వే స్టేషన్ పేరు చివర రోడ్ అని ఉందంటే, ఆ స్టేషన్ ప్రధాన నగరానికి లేదా ఊరికి కాస్త దూరంలో (శివార్లలో) ఉందని అర్థం. ప్రధాన నగరానికి లేదా ఊరికి చేరుకోవడానికి అక్కడి నుంచి రోడ్డు మార్గం లేదా ప్రత్యేకమైన రహదారిని ఉపయోగించాల్సి ఉంటుందని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు భద్రాచలం రోడ్ అని స్టేషన్ పేరు ఉంటుంది. కానీ, ఆ రైలు భద్రాచలం వెళ్లదు, భద్రాచలానికి దగ్గరల్లో ఉన్న కొత్తగూడెం అనే పట్టణానికి వెళ్తుంది. అలాగే నాసిక్ రోడ్ స్టేషన్, నాసిక్ నగరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కొడైకెనాల్ రోడ్ స్టేషన్ నుంచి కొడైకెనాల్ హిల్ స్టేషన్ దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Follow Us