Will: వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే.. ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయ్..

ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తులు హిందూ వారసత్వ చట్టం ప్రకారం పంపకం చేస్తారు. తల్లి, భార్య, కుమారులు, కుమార్తెలు, మరణించిన కుమారుడు/కుమార్తె పిల్లలు ఇలా వారసులుగా సమాన వాటా పొందుతారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Will: వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే.. ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయ్..
Document

Updated on: Apr 14, 2026 | 11:44 AM

వీలునామా(Will) లేకుండా మరణించిన వ్యక్తి ఆస్తుల పంపకానికి సంబంధించి హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉన్న నిబంధనలను ఏంటి అనేది న్యాయ నిపుణులు వివరించారు. ఒక వ్యక్తి తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలో ముందే వీలునామా రాయకుండా మరణిస్తే, ఆ ఆస్తి పంపకం విషయంలో అనేక చిక్కులు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాల్లో హిందూ వారసత్వ చట్టం 1956, 2005 సవరణ చట్టం కీలక పాత్రలు పోషిస్తాయి. ఈ చట్టం ప్రకారం వారసులను రెండు వర్గాలుగా విభజిస్తారు.

1. ప్రథమ శ్రేణి వారసులు(Class-I Heirs):

ఆస్తి పంపకంలో వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మరణించిన వ్యక్తి ఆస్తిని వీరికే సమానంగా పంచుతారు.

తల్లి(Mother): తండ్రికి హక్కు ఉండదు, కేవలం తల్లికి మాత్రమే ప్రథమ శ్రేణిలో హక్కు ఉంటుంది.

భార్య(Widow): భర్త ఆస్తిలో సమాన వాటా పొందుతుంది.

కుమారులు, కుమార్తెలు: 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా ఆస్తి హక్కు ఉంటుంది.

మరణించిన కుమారుడు/కుమార్తె సంతానం: ఒకవేళ వారసులు ముందే మరణించి ఉంటే, వారి వాటా వారి పిల్లలకు(మనవళ్లు, మనవరాళ్లకు) చెందుతుంది.

దత్తత పిల్లలు: చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా సొంత పిల్లలతో సమానమైన హక్కులు ఉంటాయి.

2. ద్వితీయ శ్రేణి వారసులు(Class-II Heirs):

ప్రథమ శ్రేణి వారసులు ఎవరూ లేని పక్షంలో మాత్రమే ఆస్తి వీరి దగ్గరకు వస్తుంది. ఇందులో తండ్రి, సోదరులు, సోదరీమణులు, వారి సంతానం ఉంటారు.

ఆస్తుల బదిలీకి చట్టబద్ధంగా ఈ క్రింది పత్రాలు అవసరం:

డెత్ సర్టిఫికెట్: మరణించినట్లు అధికారిక రుజువు.

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్: కుటుంబ సభ్యుల వివరాల కోసం.

లీగల్ హెయిర్ సర్టిఫికెట్: న్యాయస్థానం నుండి పొందే ఈ పత్రం వారసులను అధికారికంగా ధృవీకరిస్తుంది.

ప్రత్యేక సందర్భాలలో ఆస్తి హక్కులు, బహుభార్యత్వం ఉన్నప్పుడు:

1955కు ముందు వివాహాలు: ఇద్దరు భార్యలు ఉన్నా, వారిద్దరూ చట్టబద్ధమైన వారసులే. భార్యకు రావాల్సిన ఒక వాటాను వారిద్దరూ పంచుకోవాలి.

1955 తర్వాత రెండో వివాహం: ఈ వివాహం చట్టబద్ధంగా చెల్లదు. కాబట్టి రెండో భార్యకు ఆస్తిలో హక్కు ఉండదు. అయితే, ఆమె ద్వారా పుట్టిన పిల్లలకు తండ్రి స్వార్జిత ఆస్తిలో(సొంత సంపాదన) మాత్రం హక్కు ఉంటుంది. పూర్వీకుల ఆస్తిలో వీరికి హక్కు లభించదు.

విడాకులు పొందిన మొదటి భార్య పిల్లలు: భార్యకు విడాకులు ఇచ్చినంత మాత్రాన పిల్లలతో రక్త సంబంధం తెగిపోదు. కాబట్టి మొదటి భార్య సంతానానికి తండ్రి ఆస్తిలో చట్టబద్ధమైన వాటా ఉంటుంది. విడాకుల సమయంలోనే పిల్లల సెటిల్మెంట్ పూర్తి చేసుకుంటే ఆ నిబంధనల ప్రకారం ఉంటుంది, లేనిపక్షంలో వారు వాటా కోరవచ్చు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

Follow Us