
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు వారెన్ బఫెట్. ఆయన పెట్టుబడి ప్రపంచంలో ఒక దిగ్గజంగా గుర్తింపు పొందారు. దశాబ్దాలుగా ఆయన క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక దృష్టి వల్లే అపార సంపదను సృష్టించగలిగారు. సంపద సృష్టి కోసం వారెన్ బఫెట్ చెప్పే పెట్టుబడి సూత్రాలు కొత్త ఇన్వెస్టర్లకే కాదు.. అనుభవం ఉన్నవారికీ ఆచరణీయమే. సంపదను సృష్టించేందుకు స్టాక్ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరేవారి కోసం పలు సందర్భాల్లో బఫెట్ చేసిన కీలక సూచనలు ఇవిగో..
మీకు పూర్తిగా అర్థం కాని కంపెనీలు లేదా రంగాల్లో పెట్టుబడి పెట్టకండి. ఒక కంపెనీ ఎలా ఆదాయం సంపాదిస్తోంది? భవిష్యత్తులో దాని వృద్ధి ఎలా ఉంటుంది? అర్థం చేసుకుని దానిపై స్పష్టత ఉండాలి. తెలియని విషయాల గురించి అర్థం చేసుకోవాలి. స్వీయ అవగాహన, వాస్తవికతతో అర్థం చేసుకున్న తర్వాతే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని బఫెట్ సూచిస్తారు.
షేర్ మార్కెట్‌లో ప్రతిరోజూ జరిగే హెచ్చుతగ్గులను చూసి భయపడకండి. మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వాటిని సంవత్సరాల పాటు కొనసాగించడం ద్వారానే సంపద పెరుగుతుందని బఫెట్ నమ్మకం. స్వల్పకాలంలో లాభాలను ఆర్జించాలన్న అత్యాశతో కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే పెట్టుబడి పెట్టాలి.
తొందరపడి కొనడం, అమ్మడం కంటే సరైన అవకాశాల కోసం వేచి ఉండడం మంచిదని ఆయన చెబుతారు. మార్కెట్‌లో సహనం పాటించే వారే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువ.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారిలో క్రమశిక్షణ అత్యంత అవసరం. సమాజంలో ప్రబలంగా వినిపించే అభిప్రాయాల ట్రాప్‌లో పడకుండా..మనకంటూ సొంత ఆలోచన ఉండాలి. స్టాక్స్‌ను ఒక వ్యాపారంగా భావించి.. ఏది రాణిస్తుందో గుర్తించాలి. ఊహించని నష్టాల నుంచి బయటపడేలా బఫరింగ్ ఉండాలి.
వారెన్ బఫెట్ ప్రసిద్ధ సూత్రం – 1. ఎప్పుడూ మూలధనాన్ని కోల్పోవద్దు. ఈ మొదటి నియమాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అంటే భారీ లాభాల కోసం అనవసరమైన రిస్క్ తీసుకోవడం కంటే మూలధనాన్ని రక్షించుకోవడమే చాలా ముఖ్యం.
మార్కెట్ ఒక్కసారిగా పెరిగినా, పడిపోయినా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. భయం, అత్యాశ రెండూ పెట్టుబడిదారులకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. క్రమశిక్షణతో తీసుకునే నిర్ణయాలే మంచి ఫలితాలు ఇస్తాయి.
అధిక ఫీజులు ఉన్న పెట్టుబడి సాధనాల కంటే తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని బఫెట్ పలుమార్లు సూచించారు. దీర్ఘకాలంలో ఇది పెట్టుబడి రాబడిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
ఆర్థిక విజయం కోసం జ్ఞానం అత్యంత విలువైన పెట్టుబడి. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
స్టాక్ మార్కెట్‌లో విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవు. సరైన కంపెనీలను ఎంచుకోవడం, సహనం పాటించడం, దీర్ఘకాలికంగా పెట్టుబడిని కొనసాగించడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం వంటి సూత్రాలే వారెన్ బఫెట్ విజయానికి కారణం. ఈ నియమాలను క్రమంగా పాటిస్తే, దీర్ఘకాలంలో మంచి సంపదను నిర్మించుకునే అవకాశం ఉంటుంది.