
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తాయి. మీకు 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణదాతలకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దాని కోసం క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలను సక్రమంగా గడువు లోపు చెల్లించాలి. క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ వాడకపోవడం మంచిది. అలాగే క్రెడిట్ నివేదికను తరచూ పరిశీలించుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి.
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), డిజిటల్ రుణదాతలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తారు. తక్కువ వడ్డీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటివి వీటిలో ఉంటాయి. రుణం తీసుకునే ముందు వీటిని బాగా పరిశీలించాలి. ముందస్తు చార్జీలు, దాచిన ఖర్చులను కూడా తనిఖీ చేయాలి.
రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా ఈఎంఐల రూపంలో వాయిదాలు చెల్లించాలి. ఎక్కువ కాలపరిమతిని ఎంచుకుంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. కానీ వడ్డీ ఎక్కువ అవుతుంది. వీలున్నంత వరకూ తక్కువ కాల పరిమితిని ఎంపిక చేసుకోవాలి. తద్వారా వడ్డీ రూపంలో డబ్బులను ఆదా చేసుకునే వీలుంటుంది.
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. పండగ సీజన్లు, వివిధ సమయాల్లో వీటిని అమలు చేస్తాయి. ఉదాహరణకు మీరు ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తుంటే కార్పొరేట్ టై అప్ ల ద్వారా మీకు తక్కువ వడ్డీకి రుణాలు లభించవచ్చు.
తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన ఖాతాదారులకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు ప్రకటిస్తాయి. తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తాయి.
కొందరు రుణదాతలు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసేటప్పుడు బీమా పాలసీలను కూడా విక్రయిస్తారు. దీని వల్ల మీకు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రుణ ఒప్పందం మీద సంతకం చేసేటప్పుడు అన్నింటినీ గమనించాలి.
మీకు ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉంటే, వాటిపై రుణం తీసుకునే అవకాశం ఉంది. వీటికి వడ్డీ తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. సౌకర్యవంతమైన ఎంపికలు, తక్కువ డాక్యుమెంటేషన్ తో తొందరగా మంజూరవుతాయి.
మీకు ఇప్పటికే అధిక వడ్డీకి వ్యక్తిగత రుణం ఉంటే దాన్ని తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న మరో రుణదాతకు బదిలీ చేయవచ్చు. ఈ ప్రక్రియను బ్యాలెన్స్ బదిలీ అంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి