గ్లోబల్ వైడ్ గా లగ్జరీ కార్ల బ్రాండ్ గా మంచి పేరున్న వోల్వో నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు మన దేశంలో లాంచ్ అయ్యింది. వోల్వో సీ40 రీచార్జ్ కూపే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరిట మన దేశ మార్కెట్లోకి ప్రవేశించింది. రూ. 61.25లక్షల ఎక్స్ షోరూం ధరతో ఇది ఇక్కడ అడుగు పెట్టింది. సెప్టెంబర్ 5 అంటే ఈ రోజు నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు వోల్వో ప్రకటించింది. డెలివరీలు త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వోల్వో సీ40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వోల్వో సీ40 రీచార్జ్ అనేది ఆ కంపెనీ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు. అంతకుముందకు ఎక్స్‌సీ 40 రీచార్జ్ పేరిట ఓ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కూడా ఈ ఎక్స్‌సీ40 రీచార్జ్ మాదిరిగానే ఉంటుంది. అదే వెర్షన్లో ఈ సీ40 కారును లాంచ్ చేశారు. రెండూ సీఎంఏ ప్లాట్ ఫారపై ఆధారపడి పనిచేస్తుంది.
డిజైన్ విషయంలో కూడా ఎక్స్‌సీ40, సీ40 రీచార్జ్ మోడళ్లు దగ్గరగానే ఉంటాయి. ముందువైపు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే కొత్త మోడల్ సీ40లో స్లోపింగ్ రూఫ్ లైన్ అంటే కారుకు పైన ఒంపుతిరిగిన రూఫ్ ఉంటుంది. దీని ద్వారా ఈ సీ40 రీచార్జ్ కారుకు కూపే లుక్ వస్తోంది. ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లు ఉంటాయి. వెనుకవైపు పరిశీలిస్తే.. స్లీక్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. ట్విన్ పాడ్ రూఫ్ స్పయిలర్ ఉంటుంది. దీని ద్వారా కారుకు స్పోర్టీ లుక్ వచ్చింది. అంతేకాక హెడ్ లైట్లకు సరికొత్త పిక్సల్ టెక్నాలజీని వాడారు.
వోల్వో సీ40 రీచార్జ్ ఇంటీరియర్ విషయానికి వస్తే దీనిలో 9.0 అంగుళాల పోర్ట్ రైట్ స్టైల్ టచ్ స్క్రీన్ ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే డాష్ బోర్డ్ అంతా కూడా వీగన్ లెదర్ ను వాడారు. దీంతో సున్నితమైన అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. అంతేకా 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పానోరామిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, 360 డిగ్రీల కెమెరా, అడాస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లను ఈ వోల్వో కారు కలిగి ఉంది.
వోల్వో సీ40 శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడితే , దీనిలో డ్యూయల్ మోటార్ సెట్ అప్ ఉంటుంది. రెండూ వేరు వేరు యాక్సిల్స్ మీద 78కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉండే బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే 150 కిలోవాట్ల సామర్థ్యంతో డీసీ చార్జర్ కూడా ఉంటుంది. ఇది కేవలం 27 నిమిషాల్లో సున్నా నుంచి 100శాతం చార్జింగ్ ఎక్కడానికి సాయపడుతుంది. ట్విన్ మోటార్ సామర్థ్యం 408హెచ్పీ, 660ఎన్ఎం టార్క్. కేవలం 4.7 సెకండ్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న కియా ఈవీ6, హ్యుందాయ్ ఐనిక్ 5, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ వంటి మోడళ్లకు గట్టి పోటీ నిచ్చే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..