
పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ ఇస్తుండటం సాధారణ విషయమే. అయితే అమెరికాలోని లూసియానాకు చెందిన ఓ వ్యాపారవేత్త చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వేల కోట్ల బోనస్‌ను ఉద్యోగులకు ఉదారంగా ఇవ్వడంతో ఆ కంపెనీ యజమాని గ్రాహం వాకర్‌కు ‘రియల్ లైఫ్ శాంటా’ అని బిరుదు లభించింది. వివరాల్లోకి వెళితే.. గ్రాహం వాకర్ ఫైబర్ బ్రాండ్ కంపెనీ యజమాని. అయితే, ఈ కంపెనీని విక్రయించే ముందు వాకర్ తన ఉద్యోగులందరికీ కంపెనీ అమ్మకం నుంచి వచ్చే ప్రయోజనం నేరుగా చేరాలని షరతు విధించారు.
గ్రాహం వాకర్ తన కంపెనీ అమ్మకం నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 15 శాతం అంటే దాదాపు రూ. 2157 కోట్లను 540 మంది ఉద్యోగులకు పంపిణీ చేశారు. దీంతో ప్రతి ఉద్యోగికి సగటున 4,43,000(సుమారు రూ. 3.7 కోట్లు) బోనస్‌గా లభించింది. ఈ మొత్తాన్ని రాబోయే 5 ఐదేళ్లలో ఉద్యోగులకు అందిస్తారు. ఇంత పెద్ద మొత్తం బోనస్‌గా లభిస్తుండటంతో ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బాస్ గొప్ప మనసుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఉద్యోగుల నిజాయితీ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు. చాలా మంది ఉద్యోగులు కష్ట సమయాల్లో కూడా కంపెనీ కోసం పని చేశారన్నారు. తాను వారి విధేయతను గౌరవించాలనుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జూన్ నుంచి బోనస్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది మొదట తన నిర్ణయాన్ని జోక్ అనుకున్నారని.. నిజమని తెలిసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారని వివరించారు.
గ్రాహం వాకర్ ప్రకటనతో చాలా మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఇంత భారీ మొత్తం డబ్బును తాము తమ కలలను నెరవేర్చుకునేందుకు ఉపయోగించుకుంటామని ఉద్యోగులు చెబుతున్నారు. రుణాలు, పిల్లల కాలేజీ ఫీజులు చెల్లిస్తామన్నారు మరి కొందరు. 1995 నుంచి ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి.. ఈ డబ్బుతో తన సొంత బోటిక్ కలను నెరవేర్చుకుంటానని తెలిపారు. చాలా మంది ఇలాంటి నిర్ణయాలనే వెల్లడించారు.
సాధారణంగా ఒక కంపెనీని అమ్మేసినప్పుడు.. వాటాదారులకు బోనస్ లభిస్తుంది. అయితే, గ్రాహం వాకర్ నిర్ణయం మాత్రం అందుకు భిన్నం. ఉద్యోగులకు వాటాలు లేకపోయినా వారికి ప్రయోజనం చేకూర్చారు. దీంతో వాకర్ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో వాకర్ ఇప్పుడు ఒక హీరో అయిపోయారు. ఇలాంటి చర్యలు మానవత్వం విశ్వాసాన్ని బలపరుస్తాయన్నారు కొందరు నెటిజన్లు. వాకర్ నిజమైన బాస్, తన ఉద్యోగులను సొంత కుటుంబంలా చూసుకుంటున్నారు అని ప్రశంసించారు.