
భారతీయులకు అమెరికాలో మరో అరుదైన అవకాశం దక్కింది.
న్యూయార్క్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఏర్పాటు చేసిన కమిషన్‌లో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. వీరిలో ఒకరు పులిట్జర్ విజేత, ఇండియన్ అమెరికన్ ఫిజీషియన్ సిద్ధార్థ ముఖర్జీ కాగా, మరొకరు ఉన్నత విద్యావేత్త సతీష్ త్రిపాఠి. ఈ మేరకు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వీరి పేర్లను ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు 15 మందితో ‘బ్లూ రిబ్బన్ కమిషన్’ను ఏర్పాటు చే శారు. గూగుల్ మాజీ సిఇఓ ఎరిక్ స్మిత్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిషన్‌లో ముఖర్జీ, త్రిపాఠితో పాటు రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రిచర్డ్ పార్‌సన్స్, ఫోర్డ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డారెన్ వాకర్, ఐబిఎం అధ్యక్షుడు గిన్ని రొమ్మెటి వంటి ప్రముఖులు ఉన్నా రు. భారత్‌లో జన్మించిన ముఖర్జీ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కేన్సర్ వైద్యుడిగా మంచి పేరుంది. భారతీయులు అగ్రరాజ్య ఆర్థిక పాలనలోనూ పాలుపంచుకోబోతున్నారు.