SIPలో పెట్టుబడి పెట్టేందుకు రైట్‌ టైమ్‌ కోసం చూస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

మార్కెట్ గరిష్ట స్థాయిలో SIP ప్రారంభించిన పెట్టుబడిదారులు కూడా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించగలరని వైట్‌ఓక్ క్యాపిటల్ నివేదిక వెల్లడించింది. మార్కెట్ టైమింగ్ కంటే నిరంతర పెట్టుబడి, దీర్ఘకాల క్రమశిక్షణ, చక్రవడ్డీ ప్రభావమే కీలకమని అధ్యయనం సూచించింది. ఆలస్యంగా SIP ప్రారంభించడం వల్ల సంపద సృష్టిలో పెద్ద అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

SIPలో పెట్టుబడి పెట్టేందుకు రైట్‌ టైమ్‌ కోసం చూస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
Sip

Updated on: May 25, 2026 | 11:13 AM

స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత మధ్య చాలా మంది పెట్టుబడిదారులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPలు) ఇప్పుడే ప్రారంభించాలా లేదా మార్కెట్ మరింత దిగివచ్చే వరకు వేచి చూడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం సరైన సమయం కోసం ఎదురుచూడటం కంటే, త్వరగా ప్రారంభించి క్రమం తప్పకుండా కొనసాగించడం అనే సంపద సృష్టికి కీలకమని స్పష్టం చేస్తున్నాయి. WhiteOak క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విడుదల చేసిన SIP విశ్లేషణ నివేదిక (మే 2026) ప్రకారం, మార్కెట్ కనిష్ట స్థాయిలో ప్రారంభించిన SIPలు శాతం పరంగా కొద్దిగా అధిక రాబడులు ఇచ్చినప్పటికీ, మార్కెట్ గరిష్ట స్థాయిలో ప్రారంభించిన SIPలు రూపాయి పరంగా ఎక్కువ సంపదను సృష్టించాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువ కాలం పాటు పెట్టుబడి కొనసాగడం వల్ల చక్రవడ్డీ ప్రభావం బలంగా పనిచేయడమేనని నివేదిక పేర్కొంది.

ఈ అధ్యయనంలో 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ప్రధాన BSE సెన్సెక్స​్‌ TRI మార్కెట్ సవరణ చక్రాలను పరిశీలించారు. ప్రతి చక్రంలో ఇద్దరు ఊహాత్మక పెట్టుబడిదారులను పోల్చారు. ఒకరు మార్కెట్ గరిష్ట స్థాయికి సమీపంలో నెలకు రూ.10,000 SIP ప్రారంభించగా, మరొకరు మార్కెట్ కనిష్ట స్థాయికి సమీపంలో పెట్టుబడి ప్రారంభించారు. ఇద్దరూ ఏప్రిల్ 2026 వరకు పెట్టుబడులను కొనసాగించారు. 2008 మార్కెట్ సైకిల్‌ను ఉదాహరణగా తీసుకుంటే, జనవరి 2008లో SIP ప్రారంభించిన పెట్టుబడిదారుడి సంపద ఏప్రిల్ 2026 నాటికి రూ.73.46 లక్షలకు పెరిగింది. అదే సమయంలో మార్చి 2009 కనిష్ట స్థాయి తర్వాత SIP ప్రారంభించిన వ్యక్తి రూ.63.03 లక్షలు మాత్రమే సమకూర్చుకోగలిగారు. అదనంగా ఒక సంవత్సరం ముందే పెట్టుబడి ప్రారంభించడం వల్లే ఈ తేడా వచ్చిందని నివేదిక స్పష్టం చేసింది.

డాట్‌కామ్ సంక్షోభ సమయంలో కూడా మార్కెట్ 54 శాతం పతనమైనప్పటికీ, మార్కెట్ గరిష్ట స్థాయిలో SIP ప్రారంభించిన పెట్టుబడిదారుడు 13.85 శాతం XIRR రాబడిని పొందగా, కనిష్ట స్థాయి తర్వాత ప్రారంభించిన వ్యక్తికి 13.92 శాతం రాబడి వచ్చింది. అంటే దీర్ఘకాలంలో మార్కెట్ టైమింగ్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అదేవిధంగా నెలలో అత్యంత అదృష్టకరమైన రోజులో SIP చేసినా, అత్యంత దురదృష్టకరమైన రోజులో పెట్టుబడి పెట్టినా రాబడుల్లో పెద్దగా తేడా కనిపించలేదని నివేదిక తెలిపింది. కాబట్టి మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయడానికి ప్రయత్నించడం కంటే, క్రమం తప్పకుండా SIP కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలిక సంపద సృష్టి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us