Bikes: కొత్త రైడర్లకు ఆత్మవిశ్వాసం పెంచే బైక్ లు ఇవే..స్టైల్, ప్రత్యేకతల్లో వీటికివే సాటి

దేశ మార్కెట్ లోకి నిత్యం అనేక రకాల కొత్త బైక్ లు విడుదల అవుతున్నాయి. ఆధునిక ఫీచర్లు, ప్రత్యేకతలతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. యువత, పెద్దలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా వీటిని తయారు చేస్తున్నారు. అయితే కొత్తగా బైక్ నడిపే వారికి కొంత బెరకు ఉంటుంది.

Bikes: కొత్త రైడర్లకు ఆత్మవిశ్వాసం పెంచే బైక్ లు ఇవే..స్టైల్, ప్రత్యేకతల్లో వీటికివే సాటి
Bikes

Updated on: Jun 17, 2025 | 3:30 PM

రోడ్డుపై ప్రయాణ సమయంలో బైక్‌ను నియంత్రణ చేయడానికి రైడర్లు కొంచెం ఇబ్బంది పడతారు. ఇలాంటి వారి కోసం వివిధ మోడళ్ల బైక్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ప్రత్యేకతలు, స్లైల్, పనితీరు రైడర్లకు ఆత్మవిశ్వాసం కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త రైడర్లకు అనుకూలంగా ఉండే వివిధ బ్రాండ్ల బైక్ ల గురించి తెలుసుకుందాం.

రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350

స్లైలిష్ లుక్ తో ఆకట్టుకునే రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 బైక్ కొత్త వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సులభంగా నడపడంతో పాటు చాలా తేలికగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీనిలోని 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 20.78 బీహెచ్పీ శక్తి, 27 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. 181 కిలోల బరువు, 790 ఎంఎం సీటు ఎత్తుతో ప్రయాణానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైక్ రూ.1.49 లక్షలకు అందుబాటులో ఉంది.

కవాసకి నింజా 300

కొత్తగా బైక్ నడిపే వారికి కవాసకి నింజా 300 ఎంతో బాగుంటుంది. స్పోర్ట్స్ లుక్ తో ఆకర్షణీయమైన రూపంతో చక్కగా కనిపిస్తుంది. ఈ బైక్ లో 296 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారల్ ట్విన్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 38.8 బీహెచ్ పీ, 26.1 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. 179 కిలోల బరువు, ఎర్గోనామిక్ 785 ఎంఎం ఎత్తు కలిగిన వంగి ఉండే సీటుతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ రూ.3.43 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

సుజుకి జిక్సర్ 250

ఎక్కువ పవర్, స్టైల్ కోరుకునే వారికి సుజుకి జిక్సర్ 250 బైక్ సరైన ఎంపిక. 249 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో ఈ బండి నడుస్తుంది. ఇంజిన్ నుంచి 26.1 బీహెచ్పీ శక్తి, 22.2 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. కేవలం 156 కిలోల బరువుండే ఈ బైక్ ను నగరంలో పాటు జాతీయ రహదారులపై చాలా సులువుగా నడపొచ్చు. 800 ఎంఎం ఎత్తయిన సీటు, నియంత్రణకు సహాయ పడే రిలాక్స్డ్ రైడింగ్ యాంగిల్ అదనపు ప్రత్యేకతలు. ఈ బైక్ రూ.1.98 లక్షలకు అందుబాటులో ఉంది.

హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్

ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండే బైక్ లలో హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ ముందుంటుంది. అత్యుత్తమ బిగినర్స్ బైక్ లలో దీనిదే అగ్రస్థానం అని చెప్పవచ్చు. దీనిలోని 163.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ నుంచి 14.7 బీహెచ్పీ, 14 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. ఈ బైక్ బరువు కేవలం 139.6 కిలోలు కావడంతో చాలా సులువుగా నియంత్రించొచ్చు. ట్రాఫిక్ లోనూ, ఇరుకుగా ఉండే వీధుల్లో నడపడం చాలా సులభం. 790 ఎంఎం ఎత్తయిన సీటుతో రైడింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ రూ.1.11 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

హోండా హెర్నెట్ 2.0

రోజు వారి ప్రయాణానికి అనువుగా ఉండే బైక్ లలో హోండా హెర్నెట్ 2.0 ఒకటి. కొత్తగా బైక్ నడిపే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని 184.40 సీసీ ఎస్ఐ ఇంజిన్ నుంచి 16.7 బీహెచ్ పీ శక్తి, 15.7 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 142 కిలోల బరువైన ఈ బండిని నడపడం, నియంత్రించడం చాలా సులభం. సీటు ఎత్తు 590 ఎంఎం కావడంతో పొట్టిగా ఉండే వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైక్ రూ.1.57 లక్షలకు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి