
తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండోదశలో 9 కారిడార్లలో విస్తరణకు డీపీఆర్‌లు రూపొందించి కేంద్రం అనుమతి కోసం పంపించింది. మెట్రోరైలు ఫస్ట్ స్టేజ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తికాగానే రెండోదశకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనుమతులు రాగానే మొదట పాతబస్తీలో విస్తరణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఒకేసారి అన్ని కారిడార్లలో పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విస్తరణ పనులు షురూ అయితే ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండోదశను ఏ, బి కేటగిరిలుగా విభజించి అన్ని ప్రాంతాలకు సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. పాతబస్తీలో భూసేకరణ ప్రక్రియ చివరిదశలో ఉండగా, మిగిలిన కారిడార్లలో భూసేకరణకు అయ్యే రూ.2,787 కోట్ల నిధుల మంజూరుకు రాష్ట్ర మంత్రిమండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది.
రెండోదశ ‘ఏ’ కేటగిరిలో మొత్తం 76.4 కిలో మీటర్ల మెట్రో విస్తరణకు రూ.24,269 కోట్లు అంచనా. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 18 శాతం రూ.4,230 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా రూ.7,313 కోట్లు ఇవ్వనున్నాయి. 48 శాతం రూ.11,693 కోట్లు రుణాల ద్వారా, 4 శాతం రూ.1,033 కోట్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో సమకూర్చుకోనున్నాయి. రెండోదశ ‘బి’ కేటగిరిలో 86.1 కి.మీ. దూరానికి రూ.19,579 కోట్లు అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం వాటా 18 శాతం రూ.3,524 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం అంటే రూ.5,874 కోట్లు. రుణాల ద్వారా 48 శాతం రూ.9,398 కోట్లు, పీపీపీలో 4 శాతం రూ.783 కోట్లుగా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి