
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇంటిలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు, వైఫై రూటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, వాక్యూమ్ క్లీనర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటి వినియోగం వల్ల విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. వేలల్లో వచ్చే కరెంట్ బిల్లులను వందల్లోకి తగ్గించుకోవడం సాధ్యమే. సరైన పద్ధతులు, అవగాహనతో నెలకు వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. చిన్న పొదుపు అలవాట్లు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సేవింగ్స్‌కు దారి తీస్తాయి.
1. ఛార్జర్‌ల సరైన వినియోగం: ఇంట్లో ప్రతీ గదికి ఒక ఛార్జర్ ఉంచడం, వాటిని ప్లగ్‌లోనే వదిలేయడం వల్ల మనం వాడకపోయినా ఏటా 10 శాతం అదనపు విద్యుత్ బిల్లు వస్తుంది. అవసరం లేనప్పుడు ఛార్జర్లను ప్లగ్‌ల నుంచి తప్పనిసరిగా తీసివేయాలి.
2. సరైన లైటింగ్: చదువుకునేవారు గది అంతా పెద్ద లైట్ వేసే బదులు, ఎక్కువ వెలుతురునిచ్చే టాస్క్ లైట్‌ను వాడటం ద్వారా కరెంటును ఆదా చేసుకోవచ్చు. సిఎఫ్ఎల్ బల్బులు అధికంగా కరెంటును వినియోగిస్తాయి. అవి ఉంటే వెంటనే ఎల్ఈడి బల్బులతో మార్చడం ద్వారా 90 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
3. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు: డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు విద్యుత్ బిల్లు పెరగడానికి ముఖ్య కారణం. వీటిని అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం వాడనప్పుడు తప్పనిసరిగా షట్‌డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేయాలి. కేవలం నిమిషాల తరబడి ఆన్ చేసి ఉంచడం వల్ల నెలకు ఐదు యూనిట్లకు పైగా అదనపు విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇలా ఐదు ఎలక్ట్రానిక్ వస్తువులను అజాగ్రత్తగా వాడితే నెలకు రూ.200కు పైగా అదనపు బిల్లు కట్టాల్సి వస్తుంది.
4. సహజ వెంటిలేషన్: ఇంట్లో సహజ కాంతి, గాలి వచ్చేలా చూసుకోవడం వల్ల లైట్లు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
5. వేడి నీటి వినియోగం: ఉదయం వేడి నీటి స్నానానికి బదులుగా, సందర్భానుసారంగా చన్నీటి స్నానం చేయడం అలవర్చుకోండి. హీటర్లను వాడినప్పుడు, టైమర్ సెట్ చేసి, అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించాలి.
6. ఇస్త్రీ, వాషింగ్ మెషిన్: బట్టలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇస్త్రీ చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే, వాషింగ్ మెషీన్‌ను పూర్తి లోడ్‌తో చల్లని నీటితో వాడటం వల్ల కూడా విద్యుత్ ఆదా చేయవచ్చు.
కరెంట్ బిల్లు తగ్గించుకోవడంలో స్లాబ్‌ల అవగాహన చాలా కీలకం. ఉదాహరణకు, హైదరాబాద్‌లో మొదటి 50 యూనిట్ల వరకు రూ.1.95 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత 51-100 యూనిట్లకు ఒక లెక్క.. 101-200 యూనిట్లకు మరో లెక్కన వసూలు చేస్తారు. ఇక్కడే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. 100 యూనిట్లకు ఒక్క హాఫ్ యూనిట్ (100.5 యూనిట్లు) పెరిగినా, మీరు 101 యూనిట్ల స్లాబ్‌లోకి వెళ్లిపోతారు. అదేవిధంగా, 200 యూనిట్లను దాటితే యూనిట్‌కు ఒక లెక్క.. ఆపై 200 యూనిట్లు దాటినప్పుడు మినిమం ఛార్జ్ రూ.500తో పాటు యూనిట్‌కు భారీగా ఛార్జ్ పడుతుంది.
ప్రతి నెలా మొదటి 20 రోజులు మీ మీటర్ రీడింగ్‌ను గమనించడం అలవాటు చేసుకోండి. దీని ద్వారా మీ వినియోగం ఎంత ఉందో తెలుస్తుంది, అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించుకోవచ్చు. ఒక యూనిట్ తగ్గినా కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. విద్యుత్ అధికారులు 31 రోజులకు బదులు 32వ రోజు బిల్లు తీసినా స్లాబ్ మారిపోయి అధిక బిల్లు వస్తుంది. కాబట్టి, డిజిటల్ రీడింగ్‌ను స్వయంగా నమోదు చేసుకోవడం ఉత్తమం.
ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు 5-స్టార్ రేటింగ్ ఉన్న వాటిని ఎంచుకోండి. 5-స్టార్ రేటింగ్ లేని వస్తువుల వల్ల ఏటా వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. అంటే ఐదేళ్లకు రూ.5,000 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కొనేటప్పుడు కొద్దిగా ఎక్కువ ధర అయినా, దీర్ఘకాలంలో ఇది పెద్ద పొదుపుగా మారుతుంది. పొదుపుగా విద్యుత్ వాడటం ద్వారా మీ జేబుకు భారం తగ్గించుకోవడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడినట్లు అవుతుంది. అనవసర వినియోగాన్ని తగ్గించుకొని స్మార్ట్‌గా పవర్ సేవింగ్ చేయండి.
ఇది చదవండి: అలాంటోడు జట్టులో ఒక్కడుంటే చాలు.. ఎన్ని ప్రపంచకప్‌లైనా గెలవచ్చు..