హోమ్ లోన్ భారం తగ్గించుకోండిలా! అప్పు త్వరగా తీర్చడమే కాదు రూ.11 లక్షలు లాభం పొందడం ఎలాగో తెలుసా

చాలామంది ఇల్లు కొనగానే అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆందోళన చెందుతుంటారు. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా ఉంటే, హోమ్ లోన్ అనేది ఒక భారంలా కాకుండా ఒక పెట్టుబడిలా మారుతుంది. లోన్ తీసుకునే ముందు మరియు తీసుకున్న తర్వాత పాటించాల్సిన కొన్ని కీలక సూత్రాలు మీ ఆర్థిక భవిష్యత్తును మార్చేయగలవు.

హోమ్ లోన్ భారం తగ్గించుకోండిలా! అప్పు త్వరగా తీర్చడమే కాదు రూ.11 లక్షలు లాభం పొందడం ఎలాగో తెలుసా
Home Loan Smart Tips.jpg

Updated on: Mar 12, 2026 | 6:45 AM

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఈ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది తమ సంపాదనలో సింహభాగాన్ని 15 నుండి 20 ఏళ్ల పాటు ఈఎంఐ (EMI) రూపంలో చెల్లిస్తుంటారు. అయితే, కేవలం కష్టపడి సంపాదించడమే కాదు.. కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే హోమ్ లోన్‌ను త్వరగా తీర్చడమే కాకుండా, అదనంగా లక్షల రూపాయల లాభాన్ని కూడా పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ మ్యాజిక్ ఫార్ములా ఏంటో చూద్దాం.

లోన్ తీసుకునే ముందు..

ఇల్లు కొనాలనే తొందరలో ఉద్యోగ భద్రతను విస్మరించకూడదు. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా ఆదాయం తగ్గినా ఈఎంఐ చెల్లించేలా ముందే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, మీరు రూ. 70 లక్షల ఇల్లు కొనాలనుకుంటే, దానికి సమాంతరంగా సుమారు రూ. 1 కోటి వరకు మ్యూచువల్ ఫండ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే, భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

తక్కువ కాలపరిమితి..

సాధారణంగా వడ్డీ భారం తగ్గుతుందని చాలామంది 15 ఏళ్ల లోన్ తీసుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 20 నుండి 25 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని. ఎందుకంటే హోమ్ లోన్ వడ్డీ రేట్లు (సుమారు 8.5% నుండి 9%) ఇతర లోన్ల కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ అసలైన ట్రిక్ ఏంటంటే.. 15 ఏళ్ల ఈఎంఐకి, 20 ఏళ్ల ఈఎంఐకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం.

మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్

రూ. 50 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం..

  • 15 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎంఐ సుమారు రూ.49,000 ఉంటుంది.
  • అదే 20 ఏళ్లకు అయితే ఈఎంఐ రూ.43,000 మాత్రమే ఉంటుంది.
    ఇక్కడ మీకు నెలవారీగా రూ.5,800 మిగులుతుంది. ఈ మొత్తాన్ని 12 శాతం రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో 15 ఏళ్ల పాటు సిప్ (SIP) చేస్తే, మీ చేతికి సుమారు రూ. 32 లక్షలు వస్తాయి. ఈ డబ్బుతో మిగిలిన లోన్‌ను ఒక్కసారిగా తీర్చేయవచ్చు. అన్నీ పోనూ మీ చేతిలో ఇంకా రూ. 11 లక్షల అదనపు లాభం మిగులుతుంది.

రిటైర్మెంట్ నిధులను ముట్టవద్దు..

చాలామంది ఇల్లు కొనాలనే ఆవేశంలో తమ రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బును వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేతిలో అదనపు డబ్బు ఉన్నప్పుడు, దానిని లోన్ క్లోజ్ చేయడానికి వాడటం కంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. హోమ్ లోన్ అనేది కేవలం అప్పు మాత్రమే కాదు, అది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష. పైన చెప్పిన విధంగా ఈఎంఐ వ్యత్యాసాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే, అప్పు తీరడమే కాకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ప్లాన్ మీది.. లాభం మీది!

Follow Us