Silver Prices: వెండి జోరు.. దెబ్బకు తారుమారైన లెక్కలు.. ప్రపంచంలోనే మూడో స్థానానికి..

గత కొద్దిరోజులుగా బంగారం, సిల్వర్ ధరలు ఎంత భారీ మొత్తంలో పెరుగుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరుగుదలకు అసలు బ్రేక్ అనేదే పడటం లేదు. బంగారంకు తానే తక్కువ అన్నట్లు వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వెండి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

Silver Prices: వెండి జోరు.. దెబ్బకు తారుమారైన లెక్కలు.. ప్రపంచంలోనే మూడో స్థానానికి..
Silver

Updated on: Dec 24, 2025 | 3:50 PM

ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా అందనంత ఎత్తుకి చేరుకుంటున్నాయి. తులం బంగారం ఏకంగా రూ.1.40 లక్షల మార్క్‌కు చేరుకుంది. గత మూడు రోజుల క్రితం రూ.1.34 లక్షల వద్ద కొనసాగిన గోల్డ్.. ఇప్పుడు భారీగా పెరిగి లక్షా 40 వేల మార్క్‌కు చేరుకున్నాయి. గతంలో తులం బంగారం రూ.1.47 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా.. త్వరలోనే ఆ రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే స్థాయిలో పెంపు కొనసాగితే ఈ ఏడాదిలోనే లక్షన్నర మార్క్‌కు చేరుకునే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక బంగారానికి మించి వెండి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం రూ.2 లక్షలు పలికిన కిలో వెండి ఇప్పుడు రూ.2.45 లక్షలకు చేరుకుంది. త్వరలోనే రెండున్నర లక్షలకు చేరుకోనుంది. బుధవారం ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.10 వేలు పెరిగింది. ఈ పెరుగుదలతో వెండి అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన పెట్టుబడి అస్సెట్‌గా సిల్వర్ మారింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రస్తుతం సిల్వర్ 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం చేస్తే గోల్డ్ తొలి స్ధానంలో ఉండగా.. కంప్యూటర్ల తయారీ సంస్థ ఎన్‌విడియా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు యాపిల్‌ను అధిగమించి సిల్వర్ మూడో స్థానానికి చేరుకుంది.

వారం రోజుల్లోనే వెండి ధరలు ఏకంగా 9 శాతం మేర పెరగ్గా.. ఈ ఏడాదిలో వెండిపై పెట్టుడులు పెట్టినవారికి 140 శాతం మేర రాబడి పొందగలిగారు. దీంతో వెండి ప్రపంచంలోనే అతి విలువైన ఇన్వెస్ట్‌మెంట్‌గా మారింది. యూఎస్ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో పెట్టుబడిదారులు పసిడిని సురక్షితంగా భావిస్తూ వీటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పసిడి ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. అలాగే ఈటీఎఫ్‌ల రూపంలో కూడా సిల్వర్‌పై పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. వెండిపై ఇన్వెస్టర్లు ఎక్కువ మక్కువ చూపిస్తుండటంతో రానున్న రోజుల్లో రికార్డ్ స్థాయిలో పెరిగే అవకాశముంది.