Telugu News Business Scamers changed their route, they are robbing in the name of relatives, New Scam details in telugu
New Scam: రూటు మార్చిన కేటుగాళ్లు.. బంధువుల పేరుతో దోచేస్తున్నారుగా..!
సాధారణంగా అయిన వాళ్లు కష్టంలో ఉన్నారంటే వేగంగా స్పందిస్తూ ఉంటాం. ఈ విషయాన్నే కేటుగాళ్లు అవకాశంగా మార్చుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపారు. తాను మీకు బాగా తెలిసిన వారి ఫ్రెండ్‌నని, ఆయన అపాయంలో ఉన్నారని తన దగ్గర డబ్బులేదని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి డబ్బు వేయాలని అడుగుతూ మోసగిస్తున్నారు. అవసరమైతే మీ వారితో మాట్లాడండి అంటూ ఏఐ ద్వారా వారి వాయిస్‌తో కూడా మాట్లాడేస్తున్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ మోసం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ఫేక్ జాబ్ ఆఫర్‌లు లేదా స్టాక్ మార్కెట్ స్కీమ్‌ల వంటి మోసపూరిత స్కామ్‌లు పెరిగాయి. అయితే బంధువులు కష్టంలో ఉన్నారని చెప్పి సొమ్ము తస్కరించే స్కామ్‌లు కూడా కొత్తగా ప్రారంభమయ్యాయి. ఈ స్కామ్ టెక్నిక్‌లు “హే మామ్” స్కామ్ వంటి స్కామ్ కేసుల మాదిరిగానే ఉంటాయి. ఇక్కడ స్కామర్‌లు ఆపదలో ఉన్న పిల్లలను లేదా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే డబ్బు పంపమని కోరారు. ఇటీవల ఎల్‌ఐసీ ప్రీమియం పేరుతో కూడా స్కామ్ చేయడం కూడా మోసగాళ్లు ప్రారంభించారు. వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి స్కామ్‌లు అరికట్టడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోసపూరిత స్కామ్‌లకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
స్కామ్‌లను నివారణ ఇలా
మీకు ఫోన్ చేసిన కాలర్‌ను ఎల్లప్పుడూ ధ్రువీకరించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా మిమ్మల్ని బంధువు లేదా స్నేహితునిగా పేర్కొంటూ డబ్బు కోసం సంప్రదిస్తే క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. స్కామర్లు మనల్ని ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా మోసగించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరైనా వ్యక్తి కంగారు పెడితే అనుమానించడం మంచిది.
మీకు తెలియని వారితో వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎప్పుడూ పంచుకోకూడదు. ముఖ్యంగా వారితో నగదు లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
కాల్ లేదా మెసేజ్‌లో ఏదైనా ఆర్థిక సాయం కోరితే వీలైనంత త్వరగా ఆ సంభాషణను ముగించడం మేలు
ఆన్‌లైన్ స్కామ్‌ల పెరుగుదలతో మోసపూరిత వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవగాహన పెంచుకోవడానికి మీ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో మాట్లాడడం మంచిది.