SBI Home Loans: గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచారంటూ వస్తున్న వార్తలపై ఎస్‌బిఐ క్లారిటీ ఇచ్చింది. ‘‘గత కొన్ని రోజులుగా ఎస్‌బిఐ గృహ రుణాల వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అవి పండుగ సీజన్‌లో అందించే పరిమిత కాల ప్రత్యేక రాయితీలు మాత్రమే. ఆ ఆఫర్లు మార్చి 31, 2021తో ముగిశాయి. ఆ ఆఫర్లను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది.’’ అని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎస్‌బిఐ అధికారిక సమచారం ప్రకారం.. గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6.95% నుండి ప్రారంభమయ్యే అసలైన వడ్డీ రేట్లను ఎస్‌బిఐ ఇప్పటికే పునరుద్ధరించింది. ఇదే విషయాన్ని ఎస్‌బిఐ తాజాగా వెల్లడించింది. అయితే, మహిళా రుణగ్రహీతకు ఇచ్చే ప్రత్యేక రాయితీలు కొనసాగుతాయని ఎస్‌బిఐ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. పండుగ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బిఐ హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులను మార్చి 31 వరకు మాఫీ చేసిన విషయం తెలిసిందే. పరిమిత కాలంలో చెల్లించే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. ఎస్‌బిఐ తెలిపిన వివరాల ప్రకారం.. 6.70 శాతం వడ్డీతో రూ. 75 లక్షల వరకు, 6.75 శాతం వడ్డీ రేటుతో రూ. 75 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు గృహ రుణాలను ఇస్తోంది. ఈ ఆఫర్‌లో బాగంగా మార్చి 31వ తేదీ వరకు ఈ రుణాలపై ఎస్‌బిఐ 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది.
ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలో అన్ని బ్యాంకుల్లోకెల్లా ఎస్‌బిఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అన్న విషయం తెలిసిందే. అలాగే దేశంలోనే అత్యధికంగా రుణాలు అందించే బ్యాంకు కూడా. దాదాపు రూ. 5 లక్షల కోట్లు గృహ రుణాలు ఇచ్చిందంటే ఎస్బీఐ రేంజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో గృహ రుణాలలో ఎస్‌బిఐ ఒక్కటే 34శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
ఎస్‌బిఐ నెట్‌వర్క్‌ని పరిశీలిస్తే.. భారతదేశంలో 22,000 లకు మించి ఎక్కువ శాఖలతో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది ఎస్‌బిఐ బ్యాంక్. 58,000 ఎటీఎమ్ / సీడీఎం నెట్‌వర్క్, 71,000 లకు పైగా బిసి అవుట్‌లెట్‌లు ఉన్నాయి. 85 మిలియన్ల కస్టమర్లు ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వాడుతుండగా.. 19 మిలియన్ల కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్‌ను వాడుతున్నారు. ఇక ఎస్‌బిఐ ఇంటిగ్రేటెడ్ డిజిటల్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ యోనోను 74 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంత పెద్ద నెట్‌వర్క్ కలిగి ఉన్న ఎస్‌బిఐ.. దేశంలో అగ్రగ్రామిగా నిలిచింది.
అయ్.. పాయె .!, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని స్పీకర్ కు లేఖ
Covid Vaccination: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!