RBI: రూపీ డౌన్‌ఫాల్‌ ఆపకండి! ఆర్బీఐ మాజీ గవర్నర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తొందరపడి జోక్యం చేసుకోవద్దని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. రెపో రేటు పెంపు కంటే ద్రవ్య సరఫరా నియంత్రణ చర్యలే ప్రస్తుతం మేలని పేర్కొన్నారు. వడ్డీ రేట్లపై దూకుడు నిర్ణయాలు జీడీపీ వృద్ధిని దెబ్బతీయవచ్చని హెచ్చరించారు.

RBI: రూపీ డౌన్‌ఫాల్‌ ఆపకండి! ఆర్బీఐ మాజీ గవర్నర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
Rbi

Updated on: May 29, 2026 | 8:52 AM

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ వెంటనే జోక్యం చేసుకోవద్దని, మరికొంత పతనం సహజ రక్షణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దిగుమతుల ఒత్తిడి, చెల్లింపుల సమతుల్యత సమస్యల వంటి బాహ్య ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడంలో బలహీన రూపాయి కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పారు.

పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఈ నెల ప్రారంభంలో ఒక దశలో రూ.97.15 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి సుమారు 6.1 శాతం క్షీణించగా, అందులో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతల తర్వాత నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వచ్చే నెల 3 నుంచి 5 వరకు జరిగే సమావేశంలో కీలక రెపో రేటుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు మాట్లాడుతూ మారకం రేటు సంక్షోభాల్లో ద్రవ్య పరపతి విధానం చివరి అస్త్రం కావాలే తప్ప మొదటి అస్త్రం కాకూడదని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణ నియంత్రణకు వడ్డీ రేట్లు పెంచడం కంటే ద్రవ్య సరఫరా నియంత్రణ చర్యలు ప్రస్తుతం మరింత సమర్థవంతమని అభిప్రాయపడ్డారు. అలాగే రెపో రేటును దూకుడుగా పెంచితే ఆర్థిక కార్యకలాపాలు మందగించి జీడీపీ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరగడమే కాకుండా రూపాయి మీద అదనపు ఒత్తిడి ఏర్పడవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో విధాన నిర్ణేతలు కంగారు పడుతున్నట్టు కనిపించకుండా సమతుల్య వైఖరితో వ్యవహరించాలని సుబ్బారావు సూచించారు. ప్రస్తుతానికి రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగిస్తూ, వృద్ధి, ద్రవ్యోల్బణం, మారకం రేటు మధ్య సమతుల్యత సాధించడం ఉత్తమ మార్గమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us