
దేశంలోని రైతులకు పంట సాగు కోసం తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకుల నుంచి రుణం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తోంది. సకాలంలో లోన్ చెల్లించినవారికి వడ్డీలో రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా ఎలాంటి తాకట్టు అవసరం లేకుండానే ఈ రుణం అందిస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం వర్తింపచేస్తుండగా.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో మార్పులు చేసింది. గతంలో ఉన్న రూల్స్‌ను మార్చింది. కొత్త నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్- కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ డైరెక్షన్స్, 2026 పేరుతో కొత్త గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీసీ పథకంపై ఆర్‌బీఐముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు కొత్త నిబంధనలు రిలీజ్ చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనల అనంతరం రిజర్వ్ బ్యాంక్ అనేక నిబంధనలను కొనసాగిస్తూనే.. ఈ గైడ్‌లైన్స్ ఖరారు చేసింది. ఈ పథకం కింద పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితిని పెంచాలనే ప్రతిపాదనను కూడా ఆర్బీఐ పరిశీలించింది. కానీ 2024 డిసెంబర్‌లోనే ఈ పరిమితిని పెంచింది. దీంతో ఇప్పుడు మరోసారి లోన్ లిమిట్ పెంచేందుకు ఆర్బీఐ ఆసక్తి చూపలేదు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు వ్యవసాయానికి రూ. 2 లక్షల వరకు అందించే రుణం ఎలాంటి పూచీకత్తు, మార్జిన్ మనీ అడగూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రూ. 2 లక్షలకు మించిన రుణాల విషయంలో నిబంధనలు పాటిస్తూనే బ్యాంకులు తమ అంతర్గత రుణ విధానాలకు అనుగుణంగా పూచీకత్తు, మార్జిన్ అవసరాలను నిర్ధారించుకోవాలని సూచించింది.
పంటలు లేదా పశువులను తాకట్టు పెట్టి రికవరీ ఒప్పందాలతో తీసుకున్న కేసీసీ రుణాలకు కేంద్ర బ్యాంకు అదనపు ఉపశమనం కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 3 లక్షల వరకు ఉన్న రుణాలకు బ్యాంకులు భద్రత అవసరాలను పాటించాలని సూచించింది. పంట సాగు, దాని అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం మంజూరు చేసిన స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షించి పునరుద్ధరించాలని ఆర్బీఐ కోరింది. రుణ పరిమితులు రుణగ్రహీతల అవసరాలకు, మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, ప్రతి బ్యాంకు తమ రుణ విధానానికి అనుగుణంగా ఈ సమీక్షలను నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.