RBI: ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయారా..? ప్రతీఒక్కరికీ రూ.25 వేలు.. ఆర్బీఐ భారీ గుడ్ న్యూస్..

ఇటీవల సైబర్ మోసాల్లో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను కోల్పోతున్న క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ బాధ్యతను బ్యాంకులకు అప్పగించింది. కస్టమర్‌కు అందించిన సొమ్మును బ్యాంకులు, ఆర్బీఐ పంచుకుంటాయి. ఈ వివరాలు చూద్దాం.

RBI: ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయారా..?  ప్రతీఒక్కరికీ రూ.25 వేలు.. ఆర్బీఐ భారీ గుడ్ న్యూస్..
Rbi

Updated on: Nov 01, 2026 | 7:09 AM

డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు గురైనవారికి ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది. డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు గురైనవారిని ఆదుకోనుంది. ఇందుకోసం బాధితులకు పరిహారం అందించనుంది. బాధితులు తాము నష్టపోయిన సొమ్ములో 85 శాతం వరకు పరిహారం పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ రూల్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. డిజిటల్ మోసాలకు గురై బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును కోల్పోయినప్పుడు ఫిర్యాదులకు సంబంధించి కస్టమర్ బాధ్యతను నిరూపించాల్సిన భారాన్ని కూడా బ్యాంకులకు ఆర్బీఐ అప్పగించింది.

ఎంతవరకు పరిహారం పొందవచ్చు..?

సైబర్ నేరాల వల్ల రూ.50 వేలలోపు మోసపోయిన సమయంలో బాధితులకు ఈ పరిహారం అందుతుంది. 85 శాతం వరకు లేదా రూ.25 వేల వరకు.. ఈ రెండింటిల్లో ఏది తక్కువ విలువైతే అంత సొమ్ము పరిహారంగా అందిస్తారు. అయితే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇది అందిస్తారు. ప్రతీసారి జరిగే సైబర్ మోసాలకు వర్తింపచేయరు. రికవరీ అయిన మొత్తాన్ని తీసివేసిన తర్వాత మీరు కోల్పోయిన నష్టంలో 85 శాతం లేదా రూ.25 వేలల్లో ఏది తక్కువ మొత్తం అయితే అంత అందుతుంది. ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి రూ.40 వేలు నష్టపోతే ఎలా లెక్కిస్తారంటే.. 85 శాతం అంటే రూ.34 వేలు అవుతుంది. కానీ ఆర్బీఐ గరిష్ట పరిమితిని రూ.25 వేలు మాత్రమే నిర్ణయించింది. దీంతో రూ.25 వేలు మాత్రమే అందుతాయి. రూ.20 వేలు కోల్పోయిన సమయంలో బ్యాంక్ రూ.10 వేలు రికవరీ చేస్తే.. నికర నష్టం రూ.10 వేలు అవుతుంది. అప్పుడు 85 శాతం చొప్పున అంటే రూ.8,500 పరిహారం అందుతాయి. రూ.50 వేలకు మించి కోల్పోతే ఈ జాబితాలో రావు.

నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు..?

నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యతను బ్యాంకులకు ఆర్బీఐ అప్పగించింది. కస్టమర్ ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ జరపాలి. అనంతరం రికవరీ చేసిన సొమ్మును సర్దుబాటు చేసిన తర్వాత పరిహారాన్ని లెక్కించి అకౌంట్లో జమ చేయాలి. బ్యాంకులు ఈ పరిహారం చెల్లించినా.. ఆ తర్వాత దీనిని బ్యాంకులు, ఆర్బీఐ పంచుకుంటాయి. అయితే పరిహారం అందుకోవాలంటే మోసం జరిగిన ఐదు రోజుల్లోపు బ్యాంక్‌కు కస్టమర్ ఫిర్యాదు చేసి ఉండాలి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేసి ఉండాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us