దీపావళి పండుగ కోసం జేబులు ఖాళీ చేశారా? మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ 6 పనులు చేయాల్సిందే!

దీపావళి పండుగ సందడి ముగిసింది. కొత్త బట్టలు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లతో పండుగను ఘనంగా జరుపుకున్న కుటుంబాలకు ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. క్రెడిట్ కార్డు బిల్లులు, పండుగ ఈఎంఐలు, బై నౌ పే లేటర్ (BNPL) చెల్లింపులు నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగ కోసం చేసిన కొన్ని రోజుల షాపింగ్.. రాబోయే కొన్ని నెలల పాటు ఆర్థిక భారంగా మారకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

దీపావళి పండుగ కోసం జేబులు ఖాళీ చేశారా? మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ 6 పనులు చేయాల్సిందే!
Post Diwali Financial Stress

Updated on: Nov 12, 2026 | 9:20 AM

దీపావళి పండుగ సందడి ముగిసింది. కొత్త బట్టలు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లతో పండుగను ఘనంగా జరుపుకున్న కుటుంబాలకు ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. క్రెడిట్ కార్డు బిల్లులు, పండుగ ఈఎంఐలు, బై నౌ పే లేటర్ (BNPL) చెల్లింపులు నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగ కోసం చేసిన కొన్ని రోజుల షాపింగ్.. రాబోయే కొన్ని నెలల పాటు ఆర్థిక భారంగా మారకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

పండుగ ఖర్చులు ఎంతంటే?

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం, 2025లో రూ.6.05 లక్షల కోట్లుగా ఉన్న పండుగ వ్యాపారం 2026లో రూ.7 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది. అంటే దాదాపు 16 శాతం వృద్ధి. అయితే లోకల్‌సర్కిల్స్ సర్వే మాత్రం పట్టణ కుటుంబాల పండుగ ఖర్చులు 6 శాతం తగ్గి రూ.1.97 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఖర్చు చేసిన కుటుంబాల్లో 83 శాతం మంది పొదుపు సొమ్మును ఉపయోగించుకున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

మరి దీపావళి ఖర్చుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

1. అన్ని ఖర్చులు, ఈఎంఐల వివరాలు తెలుసుకోండి

ముందుగా దీపావళికి ఎంత ఖర్చు చేశారో లెక్క వేయాలి. క్రెడిట్ కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాలు, ఈఎంఐలు, బై నౌ పే లేటర్ చెల్లింపులు, పొదుపు ఖాతాల నుంచి తీసిన మొత్తాలను ఒకచోట నమోదు చేయాలి. ఏ బిల్లు ఎప్పుడు చెల్లించాలి? ఎంత వడ్డీ పడుతోంది? ఇంకా ఎన్ని వాయిదాలు ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకోవాలి.

2. అధిక వడ్డీ అప్పులను ముందుగా తీర్చండి

క్రెడిట్ కార్డు బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాధారణంగా కార్డును బట్టి నెలకు 2.5 నుంచి 4 శాతం వరకు వడ్డీ పడే అవకాశం ఉంది. అంటే ఏడాదికి దాదాపు 30 నుంచి 48 శాతం వరకు వడ్డీ భారం ఉండవచ్చు. కేవలం కనీస బకాయి చెల్లించి మిగతా మొత్తాన్ని అలాగే ఉంచితే వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. వీలైతే పూర్తి బిల్లు చెల్లించాలి. అవసరమైతే తక్కువ వడ్డీతో లభించే రుణ మార్పిడి అవకాశాలను పరిశీలించాలి.

3. నెలవారీ ఈఎంఐలకు పరిమితి పెట్టుకోండి

మీ నెలవారీ టేక్‌హోమ్ జీతంలో మొత్తం రుణ వాయిదాలు 40 నుంచి 50 శాతానికి మించకుండా చూసుకోవడం ఒక సాధారణ మార్గదర్శకం. ఉదాహరణకు రూ.50 వేల జీతం ఉంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య రుణ చెల్లింపులు ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. అయితే కుటుంబ ఖర్చులు, అద్దె, ఇతర బాధ్యతలను బట్టి ఈ పరిమితిని మరింత తగ్గించుకోవాలి.

4. అత్యవసర నిధిని మళ్లీ పెంచుకోండి

దీపావళి కోసం పొదుపును ఖర్చు చేసినవారు తిరిగి అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా డబ్బును సులభంగా అందుబాటులో ఉండేలా ఉంచుకోవాలి. కొత్త షాపింగ్, అనవసర ఖర్చులను తగ్గించి ఈ నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి.

5. SIPలను కొనసాగించాలా? వద్దా?

పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి క్రమశిక్షణ ముఖ్యమే అయినప్పటికీ, 36 నుంచి 48 శాతం వడ్డీ పడే క్రెడిట్ కార్డు అప్పును పట్టించుకోకుండా SIPలను పెంచడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఆదాయం, అప్పుల భారం, అత్యవసర పొదుపులను బట్టి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి.

6. పండుగ బోనస్‌ను అప్పుల తగ్గింపునకు వాడండి

దీపావళి బోనస్ లేదా అదనపు ఆదాయం వస్తే మరో కొత్త వస్తువు కొనాలనే ఆలోచనను పక్కన పెట్టండి. ముందుగా అధిక వడ్డీ అప్పులను తగ్గించండి. ఆ తర్వాత అత్యవసర నిధిని పెంచుకోండి.

మొత్తంగా చెప్పాలంటే.. దీపావళి వేడుకలు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఆర్థిక ఇబ్బందులను మిగల్చకూడదు. రాబోయే నెలల్లో కొత్త అప్పులు చేయకుండా, పాత బకాయిలను తగ్గించుకుంటూ, పొదుపును తిరిగి పెంచుకుంటే కుటుంబ ఆర్థిక పరిస్థితిని సులభంగా గాడిలో పెట్టుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us