
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాడుతున్న యూజర్లకు ఫోన్‌పే తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా 365 రోజుల పాటు ఎటువంటి లావాదేవీలు జరపని వాలెట్ ఖాతాలకు జరిమానా తప్పదు. ఈ ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? అసలు ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది? ఫోన్‌పే వాలెట్ మెయింటెనెన్స్ ఫీజుకు సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం..
ఫోన్‌పే తన తాజా పాలసీ అప్‌డేట్‌లో భాగంగా, నిష్క్రియంగా ఉన్న వాలెట్లపై రూ. 100 త్రైమాసిక మెయింటెనెన్స్ ఫీజును విధిస్తున్నట్లు ప్రకటించింది. ఒక వినియోగదారుడు తన ఫోన్‌పే వాలెట్ ద్వారా ఏడాది పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతే, ఆ వాలెట్‌ను ‘ఇన్-యాక్టివ్’గా పరిగణిస్తారు. ప్లాట్‌ఫారమ్ మెరుగుదలలు మరియు భద్రతా ప్రమాణాలను నిర్వహించడం కోసమే ఈ ఫీజును వసూలు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
చాలామంది యూజర్లు కేవలం యాప్‌లో లాగిన్ అవ్వడం లేదా బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా యూపీఐ (UPI) లావాదేవీలు చేయడం వల్ల వాలెట్ యాక్టివ్‌గా ఉంటుందని భావిస్తారు. కానీ ఫోన్‌పే నిబంధనల ప్రకారం, నేరుగా బ్యాంక్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్లు వాలెట్ యాక్టివిటీ కిందకు రావు. వాలెట్ యాక్టివ్‌గా ఉండాలంటే, ఖచ్చితంగా మీ ‘వాలెట్ బ్యాలెన్స్’ ఉపయోగించి ఏదైనా ఒక చిన్న లావాదేవీ (రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్) చేయాల్సి ఉంటుంది.
గుర్తుంచుకోండి, ఈ రూల్ కేవలం ‘వాలెట్’కు మాత్రమే. మీరు సాధారణంగా చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయి! కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు, మీ వాలెట్ హిస్టరీ ఒక్కసారి చూసుకోండి.