
పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి EPFO సిద్ధమవుతోంది. EPFO 3.0 పేరుతో తీసుకువస్తున్న కొత్త అప్‌డేట్ ద్వారా, ఉద్యోగులు ఇకపై తమ PF మొత్తాన్ని UPI, ATMల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కలగనుంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్‌ల ద్వారా PF డబ్బును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. విత్‌డ్రా చేసిన మొత్తం వినియోగదారుల లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, సంబంధిత యాప్‌లలో EPFO విత్‌డ్రాయల్ అనే ప్రత్యేక ఆప్షన్ కనిపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సేవ అందుబాటులో లేకపోయినా సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధానంలో వినియోగదారులు తమ UAN నంబర్‌ను నమోదు చేసి, విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ఎంచుకోవాలి. అదనంగా ఆ మొత్తాన్ని ఏ అవసరానికి వినియోగించనున్నారో కూడా పేర్కొనాల్సి ఉంటుంది. సాధారణంగా వైద్య అవసరాలు, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాల కోసం ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
వివరాలు సమర్పించిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ధృవీకరించిన వెంటనే డబ్బు నేరుగా ఖాతాలో జమ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండటంతో, పేపర్‌వర్క్ అవసరం దాదాపుగా ఉండదు. EPFO 3.0 అమలుతో PF ఉపసంహరణ వ్యవస్థ మరింత వేగవంతం, పారదర్శకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించడంతో పాటు, డిజిటల్ ఇండియా దిశగా మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి