
ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ యూపీఐ యాప్‌లు వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న వారందరి ఫోన్లల్లో యూపీఐ యాప్‌లు ఖచ్చితంగా ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్లో అనేక యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అనేక కంపెనీలు కొత్తగా మరికొన్ని యాప్స్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో యూపీఐ యాప్స్ వాడకం నానాటికి పెరుగుతూనే ఉంది. ప్రతీ ఏడాది రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం వంటి సౌకర్యాలు ఉండటంతో బ్యాంకు వినియోగదారులందరూ యూపీఐ యాప్స్ వాడుతున్నారు. బ్యాంకులు స్వయంగా తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌లో యూపీఐ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నాయి.
అయితే యూపీఐ ద్వారా మనం పేమెంట్స్ చేయాలన్నా లేదా వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా మన అకౌంట్లో డబ్బులు ఉండాలి. కానీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా వినియోగదారులు పేమెంట్స్ చేసేందుకు వీలుగా క్రెడిట్ లైన్‌ను జారీ చేస్తున్నాయి యాప్‌లు. అంటే యాప్‌లే అప్పుగా డబ్బులు ఇస్తున్నాయి. చాలామంది ఈ ఫెసిలిటీని వాడుకుంటున్నారు. కొంతమంది వీటికి అలవాటు క్రెడిట్ లైన్‌ను విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. చిన్న చిన్న దుకాణాల వద్ద కాకుండా ఏదైనా అవసరాలకు వీటి ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న పేమెంట్స్ వల్ల నెల చివరి నాటికి ఆర్ధిక భారం పెరుగుతుంది. దీంతో దీని వల్ల అప్పుల ఊబిలోకి వెళ్లే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ లైన్‌ను ఎక్కువగా వాడుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
-అవసరమైన సమయంలో మాత్రమే క్రెడిట్ లైన్ ఉపయోగించుకోండి
-క్రెడిట్ లైన్ వల్ల మీకు ఎలాంటి క్యాష్ బ్యాంక్, డిస్కౌంట్లు అందవు
-వాడేటప్పుడు రెండు మూడుసార్లు ఆలోచించుకోండి.. అత్యవసరమైతే తప్పితే వాడండి
-కేవలం ఖర్చుల కోసమే దీనిని విచ్చలవిడిగా వాడొద్దు
-పేమెంట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తున్నారా లేదా క్రెడిట్ లైన్ నుంచి చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి
క్రెడిట్ కార్డులతో పేమెంట్
ఇక యూపీఐ యాప్స్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. కొంతమంది క్రెడిట్ కార్డును ఇందుకోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని ద్వారా కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డు వాడటం వల్ల లిమిట్ ఎక్కువగా వాడటం వల్ల సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుంది.