New Rules: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్.. ఈ విషయాల్లో భారీ మార్పులు.. ఇవి తప్పక తెలుసుకోండి

కొత్త ఏడాది వస్తుండటంతో ప్రజలపై ప్రభావితం చేపే అనేక కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటి గురించి మనం ముందే తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడవచ్చు. కొత్త ఆర్ధిక నిర్ణయాలను బ్యాంకులు, ప్రభుత్వాలు కొత్త ఏడాది నుంచి అమల్లోకి తెస్తూ ఉంటాయి. జనవరి 1 నుంచి జరగనున్న మార్పులేంటో చూద్దాం.

New Rules: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్.. ఈ విషయాల్లో భారీ మార్పులు.. ఇవి తప్పక తెలుసుకోండి
2026 January 1

Updated on: Dec 23, 2025 | 9:14 AM

మరో వారం రోజుల్లో 2025 ముగియబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అందరూ సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళుతుండగా.. మరికొంతమంది ఇంట్లోనే జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొత్త ఏడాది వస్తుందంటే.. అందరిలోనూ నూతనోత్సాహం వస్తుంది. వచ్చే ఏడాది ఏయే పనులు చేయాలనేది ఓ లక్ష్యం పెట్టుకుంటారు. దీంతో పాటు న్యూ ఇయర్ వస్తుందంటే ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే పలు విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. బ్యాంకింగ్ నుంచి జీతాల వరకు 2026లో జరగబోయే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ రిపోర్ట్‌లో మార్పులు

2026 నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది. దీని వల్ల మోసపూరితంగా లోన్లు పొందేవారికి చెక్ పడుతుందని అంటోంది.

సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి

సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం వాటిని అరికట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక నుంచి సోషల్ మీడియా యాప్‌లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. సిమ్ బైండింగ్, వెరిఫికేషన్ చేసేకే యాప్స్ వాడేలా మార్పులు చేయాలని వాట్సప్, టెలిగ్రాం, స్పాప్ చాట్ లాంటి యాప్స్‌ను కేంద్రం ఆదేశించింది. దీంతో కొత్త సంవత్సరం నుంచి దీనిని అమలు చేయనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పండగే

ఇక జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇక 2026 నుంచి ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల కనీస వేతనాలను పెంచడానికి సిద్దమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి.

వంట గ్యాస్ సిలిండర్ ధరలు

ప్రతీ నెల 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ తేదీన కొత్త రేట్లను ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గించారు. ఇక జనవరి 1న కొత్త ధరలను ప్రకటించనున్నారు. కొత్త ఏడాదిలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి