
Fixed Deposit: ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా..? మీ ట్యాక్స్ ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు మంచి అవకాశం. ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి పన్నుదారులు చాలా మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. వివిధ వాటిల్లో పెట్టుబడులు పెడుతూ ట్యాక్స్ తగ్గించుకుంటూ ఉంటారు. ఇక మార్కెట్లో ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ చాలా ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్‌తో పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం అనేక బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌ను అందిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్ డ్ డిపాజిట్ల గురించి మనందికీ తెలిసిందే. బ్యాంకులన్నీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు పొదుపు చేసుకుంటే మీకు వడ్డీ చెల్లిస్తారు. సేవింగ్స్ అకౌంట్ కన్నా ఫిక్స్ డ్ డిపాజిట్లలో వడ్డీ అధికంగా ఉంటుంది. ఇక ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా సాధారణ ఫిక్స్ డ్ డిపాజిట్ల తరహాలోనే ఉంటాయి. అయితే ఈ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసినవారికి ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. కానీ ఈ డిపాజిట్లకు 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీని వల్ల మీరు 5 సంవత్సరాలకు ముందే నగదు కావాలంటే తీసుకోవడానికి కుదరదు. అలాగే మీరు ఈ డిపాజిట్లపై లోన్ కూడా పొందలేరు.
మీరు ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో వెయ్యి నుంచి గరిష్టంగా ఎంతవరకు అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనంతో పాటు బ్యాంకులు ఈ ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. దీని వల్ల మీకు టెన్యూర్ తర్వాత రాబడి కూడా ఎక్కువ లభిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.00 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 7.00 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7 శాతం, యస్ బ్యాంక్ 7.25 శాతం, ఇండస్ ఇండ్ 7.25 శాతం, ఫెడరల్ బ్యాంక్ 7.10 శాతం, కోటక్ మహీంద్రా 6.20 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.