రోజుకు రూ.2తో రూ.2 లక్షల బీమా పొందవచ్చు.. చాలా చవక.. సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలకు బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి రూ.436 చెల్లించడం ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తారు. అసలు ఈ పాలసీ ఏంటి..? ఎలా అప్లై చేసుకోవాలి..? అనే వివరాలు..

రోజుకు రూ.2తో రూ.2 లక్షల బీమా పొందవచ్చు.. చాలా చవక..  సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి
Pm Jeevan Jyoti Bima Yojana

Updated on: Dec 02, 2025 | 9:29 AM

PM Jeevan Jyoti Bima Yojana: కరోనా తర్వాత హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ వంటి ఇన్స్యూరెన్స్ పాలసీలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. కరోనా సృష్టించిన విలయతాండవం వల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో తమతో పాటు కుటుంబసభ్యుల సంక్షేమం కోసం హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ లాంటి పాలసీలు తీసుకుంటున్నారు. దీంతో కొత్తగా అనేక బీమా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య బీమా స్కీమ్స్‌ తీసుకొచ్చింది. అందులో భాగమే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ. కేవలం రోజుకు రూపాయిన్నర కంటే తక్కువ డబ్బుతో రూ.2 లక్షల బీమా అందిస్తోంది.  పాలసీదారులు ఏదైనా కారణంతో మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షలు అందుతుంది. అద్భుతమైన ఈ పాలసీ వివరాలు ఇక్కడ చూడండి

ఎవరు అర్హులు?

భారతదేశంలో నివసించే ప్రతీఒక్కరూ దీనికి అర్హులు. వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎల్‌ఐసీతో పాటు అన్ని బ్యాంకులు ప్రభుత్వ అనుమతితో ఈ పాలసీని అందిస్తున్నాయి. బ్యాంకులను సంప్రదించి మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో పాలసీ నడుస్తుంది. పాలసీదారుడు తప్పనిసరిగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.

ప్రీమియం ఎంత..?

సంవత్సరానికి రూ.436 చెల్లించాలి. ఇవి ఆటోమేటిక్‌గా మీరు ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ నుంచి ప్రతీ సంవత్సరం డెడిట్ అవుతాయి. పాలసీ తీసుకున్నాక ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షలు అందిస్తారు. ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేదు. మీకు ఇష్టవచ్చిన బ్యాంకుకు వెళ్లి సులభంగా పాలసీ సులువుగా తీసుకోవచ్చు. పోస్టాఫీసులో కూడా తీసుకునే అవకాశముంది.

రెన్యూవల్ చేయకపోతే..

జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ ఉంటుంది. జూన్ 21 తర్వాత మీ అకౌంట్లో నగదు లేక ఆటో డెబిట్ అవ్వకపోతే పాలసీ రెన్యూవల్ అవ్వదు. మళ్లీ మీరు పాలసీ తీసుకోవాలంటే కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరం కట్టిన డబ్బులు తిరిగి రావు. కొత్తగా పాలసీ తీసుకున్నవారికి ఒక నెల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ మరణించినవారికి మాత్రమే బీమా వస్తుంది.

క్లెయిమ్ రేషియో..

ఇప్పటివరకు ఈ పాలసీలో 23.36 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. 9,19,896 మందికి క్లెయిమ్ సెటిల్ చేశారు. దీని ద్వారా రూ.18.397 కోట్లను పాలసీదారుల కుటుంబసభ్యులకు అందించారు. ఇందులో 10.66 కోట్ల మంది మహిళా లబ్దిదారులు ఉండగా..7.8 కోట్ల మంది PMJFY అకౌంట్లదారులు ఉన్నారు.