
నగరాలు, పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఉంటారు. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు డిటిజల్ చెల్లింపుల యుగం నడుస్తుండటంతో ఎక్కువమంది తమ నెలవారీ అద్దెను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది క్యాష్ రూపంలో ఇంటి అద్దెను యజమానికి అందిస్తున్నారు. ఇలా చెల్లించడం చట్ట విరుద్దం కానప్పటికీ.. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే రికార్డులు ఉంటాయి. అదే నగదు రూపంలో చెల్లిస్తే ఎలాంటి రికార్డులు ఉండవు. దీని వల్ల మీరు భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అద్దె రసీదు లాంటిది లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశముంది.
అద్దె నగదు రూపంలో చెల్లిస్తే యజమాని నుంచి రసీదు తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు హౌస్ రెంట్ అలవెన్స్(HRA) క్లెయిమ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఇంటి యాజమానితో ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు ప్రూఫ్ కింద ఉంటుంది. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021లో అద్దె చెల్లింపు, రసీదులు, వివాదాలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. అద్దెను నగదు రూపంలో చెల్లించవచ్చని రెంటల్ అగ్రిమెంట్‌లో ఉంటే.. నగదు రూపంలో చెల్లించడం చట్టబద్ధమేనని చెప్పవచ్చు. అయితే మీరు అద్దె చెల్లించిన తర్వాత తప్పకుండా రసీదు పొందండి. దీని వల్ల మీరు చెల్లించినట్లు ఒక రికార్డ్ ఉంటుంది.
అద్దె రసీదు కేవలం ఒక పత్రం మాత్రమే కాదు. మీరు మీ అద్దెను సమయానికి చెల్లించారని, ఇంటి యజమాని దానిని అందుకున్నారని తెలిపే ప్రూఫ్ కింద ఉంటుంది. ఈ రసీదులో అద్దె మొత్తం, నెల పేరు, చెల్లింపు తేదీ వివరాలు ఉంటాయి. ఇక అద్దె వివాదం, హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ లేదా మీరు సమయానికి చెల్లించారని నిరూపించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల మీరు అద్దె చెల్లించే ప్రతిసారీ అద్దె రసీదును తీసుకోవడం చాలా అవసరం. ఇంటి యజమాని అద్దె రసీదులు ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే యజమానితో వాదించాల్సిన పని లేకుండా తెలివిగా వ్యవహరించాలి. ప్రతి అద్దెకు సంబంధించిన చెల్లింపు తేదీలు, మొత్తాలు, మీ ఇంటి యజమాని నుండి వచ్చిన సందేశాలు లేదా ఇమెయిల్‌ల వంటి రికార్డులను భద్రపరచండి. వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎంఎస్ లేదా లేఖ ద్వారా అద్దె రసీదును కోరండి