దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి కూడా అతనికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అది మునుపటి ఈ-మెయిల్ ఐడి నుంచే వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా పంపిన ఈమెయిల్‌కు స్పందించకపోవడంతో మరోసారి మెయిల్ పంపుతూ ఎక్కువ మొత్తంలో డబ్బును డిమాండ్ చేశాడు దుండగుడు. ముఖేష్ అంబానీ నుండి 200 కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్ వేశారు. ముందుగా స్పందించకపోవడంతో ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వాలని మెయిల్‌లో డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అంతకుముందు, ముఖేష్ అంబానీని షార్ప్ షూటర్‌తో కాల్చివేస్తానని శుక్రవారం సాయంత్రం ఇ-మెయిల్ వచ్చిందని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై గాందేవి పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి అదే ఈ-మెయిల్ ఐడీ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి.
అక్టోబర్ 27న ముకేశ్ అంబానీకి మొదటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. భారత్‌లో అత్యుత్తమ షార్ప్ షూటర్లు అతని వద్ద ఉన్నారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రాణం కాపాడాలంటే రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత, సెక్యూరిటీ ఇన్‌చార్జి సమాచారం మేరకు, ముంబై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 387 మరియు 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలను చేర్చేందుకు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన రోజే ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. అదే రోజున కంపెనీ జూలై-సెప్టెంబర్ ఫలితాలను ప్రకటించింది. ఇందులో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.19,878 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
అయితే ముఖేష్ అంబానీ లేదా అతని కుటుంబానికి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరు 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఓ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేయాలనే చర్చ కూడా జరిగింది. అయితే, ఆ వ్యక్తిని మరుసటి రోజు బీహార్‌లో అరెస్టు చేశారు. అతన్ని రాకేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం గుర్తించడం కలకలం రేపింది. తాజాగా రెండు సార్లు ఇమెయిల్ రావడంతో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి