శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో జపాన్‌ సంస్థ రూ.39,618 కోట్ల పెట్టుబడి! ఎంత వాటా కొనుగోలు?

జపాన్ ఆర్థిక సంస్థ MUFG బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్‌లో రూ.39,618 కోట్లతో 20 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. ఇది భారత్-జపాన్ ఆర్థిక రంగంలో అతిపెద్ద పెట్టుబడి. ఈ ఒప్పందంతో MUFG భారత మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకోగా, శ్రీరామ్ ఫైనాన్స్ వృద్ధి ప్రణాళికలు వేగవంతం అవుతాయి.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో జపాన్‌ సంస్థ రూ.39,618 కోట్ల పెట్టుబడి! ఎంత వాటా కొనుగోలు?
Shriram Finance, Mufg Bank

Updated on: Apr 08, 2026 | 9:49 PM

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ MUFG బ్యాంక్‌, భారతీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో భారీ పెట్టుబడి పెట్టింది. సుమారు రూ.39,618 కోట్ల విలువైన ఈ ఒప్పందంతో కంపెనీలో 20 శాతం ఈక్విటీ వాటాను MUFG సొంతం చేసుకుంది. ఇది భారత్–జపాన్ మధ్య ఆర్థిక రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పెట్టుబడిగా గుర్తింపు పొందింది. ఈ లావాదేవీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా జరిగింది. ఈ ప్రక్రియలో MUFG బ్యాంక్‌కు సుమారు 471.1 మిలియన్ షేర్లు ఒక్కోటి రూ.840.93 ధరకు కేటాయించబడ్డాయి. అవసరమైన నియంత్రణ అనుమతులు, ముఖ్యంగా కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా ఆమోదం తర్వాత ఈ ఒప్పందం పూర్తయింది.

ఈ పెట్టుబడితో MUFG భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తన వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేసుకునేందుకు గ్లోబల్ నైపుణ్యాన్ని వినియోగించుకునే అవకాశం పొందింది. ముఖ్యంగా MSME, రిటైల్ రుణ విభాగాల్లో విస్తరణకు ఇది కీలకంగా మారనుంది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రెవంకర్ ప్రకారం.. ఈ పెట్టుబడి సంస్థ మూలధనాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఇది ఆవిష్కరణలు, తక్కువ ఖర్చుతో నిధుల సమీకరణ, మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్‌కు దోహదపడుతుంది.

అదేవిధంగా MUFG గ్రూప్ సీఈఓ జూనిచీ, భారతదేశంలో ఉన్న విస్తృత వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం MUFG, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి నాంది పలికింది. భారత ఆర్థిక రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి ఇది ఒక ముఖ్య సంకేతంగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us