
అంతర్జాతీయ సరిహద్దుల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని, తెలంగాణ పౌల్ట్రీ రంగాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమాంతం ఆగిపోయాయి. తాజా నివేదికల ప్రకారం.. సుమారు 300 మిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ కంటైనర్లు వివిధ పోర్టుల్లో నిలిచిపోయాయి. ఈ భారీ నష్టంలో దాదాపు 60 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌దే కావడం ఆందోళనకరం. విశాఖపట్నం, ముంబై పోర్టుల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల కంటైనర్లు కదలడం లేదు. ఎర్ర సముద్రం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గాల్లో దాడుల భయంతో షిప్పింగ్ నిలిచిపోయింది
ఒకవైపు ఎగుమతులు ఆగిపోతుంటే.. మరోవైపు షిప్పింగ్ కంపెనీలు చార్జీలను రెట్టింపు చేశాయి. ఒక్కో కంటైనర్‌పై 1500 నుండి 4000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ సర్‌చార్జీలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రొయ్యలు పాడవకుండా ఉంచే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. “అమెరికా టారిఫ్‌ల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. ఈ యుద్ధం మా వెన్ను విరిచింది’’ అని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో, స్థానిక మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనివల్ల పల్లెల్లో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
యుద్ధం ప్రభావం కేవలం సముద్ర ఉత్పత్తులపైనే కాదు మన పౌల్ట్రీ రంగంపై కూడా తీవ్రంగా పడింది. హైదరాబాద్, నామక్కల్ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగడంతో స్థానిక మార్కెట్‌లో గుడ్ల నిల్వలు పెరిగి, ధరలు పడిపోతున్నాయి. దీనివల్ల పౌల్ట్రీ రైతులకు రోజుకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. భారత హలాల్ మాంసం ఎగుమతుల్లో సగానికి పైగా వాటా గల్ఫ్ దేశాలదే. ఇప్పుడు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, కంటైనర్లు ముంబై పోర్టులోనే ఆగిపోవడంతో వేలాది టన్నుల మాంసం పాడైపోయే పరిస్థితి ఏర్పడింది.
పెట్రోల్ రేట్ల గురించి సామాన్యుడు భయపడుతుంటే.. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు మూసుకుపోవడంతో తెలుగు రైతు తన పెట్టుబడి ఎక్కడ సముద్రం పాలవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎగుమతిదారులకు, రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.