
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వరుసగా ధరలు దిగిరావడం సామాన్య కొనుగోలుదారులకు, ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే ఈ తగ్గుదల ఇక్కడితో ఆగదని, 2027 మొదటి ఆరు నెలల పాటు పసిడి, వెండి ధరలు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ ధరలు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనుసరిస్తున్న కఠిన వైఖరి, అమెరికన్ డాలర్ బలపడటం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలను నియంత్రించనున్నాయి. అయితే దీర్ఘకాలంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు పసిడి ధరలకు మళ్లీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
బ్రోకరేజ్ సంస్థ వెంచురా కమోడిటీస్ అండ్ CRM విభాగాధిపతి ఎన్.ఎస్. రామస్వామి అంచనా ప్రకారం.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, అధిక బాండ్ రాబడుల వల్ల బంగారంపై ఒత్తిడి పెరగవచ్చు. 2027 మధ్యలో వడ్డీ రేట్ల కోత మొదలయ్యాక ధరలు కోలుకునే అవకాశం ఉంది. ఆయన అంచనా ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధరలు ఇలా ఉండవచ్చు.
పీఎల్ క్యాపిటల్ కమోడిటీస్ అధిపతి ఆశిష్ రాజోడియా విశ్లేషణ ప్రకారం.. భారీ దిద్దుబాటు తర్వాత బంగారం, వెండి 2027లోకి అడుగుపెడుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం సుమారు రూ. 1.20 లక్షలు, కిలో వెండి రూ. 1.40 లక్షల స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో ధరల కదలికలు ఇలా ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.
రాబోయే 6 నెలల్లో బంగారం: 10 గ్రాముల పసిడి ధర రూ. 1,12,000 నుండి రూ. 1,35,000 మధ్య ఉండొచ్చు.
12 నెలల కాలంలో బంగారం: వడ్డీ రేట్ల పెంపు ఒత్తిడి తగ్గిన తర్వాత 10 గ్రాముల బంగారం తిరిగి రూ. 1,20,000 నుండి రూ. 1,50,000 స్థాయికి చేరుకోవచ్చు .
వెండి ధరల తీరు: వెండిలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 12 నెలల్లో కిలో వెండి ధర రూ. 1,40,000 నుండి రూ. 1,90,000 మధ్య ఉండవచ్చని అంచనా.
మొత్తానికి 2027 మొదటి అర్ధభాగంలో బంగారం, వెండి ధరలు బలహీనంగా ఉండటం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారనుంది. సంవత్సరం ద్వితీయార్థంలో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తగ్గుదల సమయంలో కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.