
తక్కువ EMI అంటే తక్కువ ఖర్చు అని భావించడం చాలా సాధారణం. కానీ వాస్తవానికి ఇది ఆర్థికంగా ప్రమాదకరమైన నిర్ణయంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రభావం వల్ల, నెలవారీ వాయిదాలు తగ్గినా మొత్తం చెల్లించే డబ్బు గణనీయంగా పెరుగుతుంది. అంటే మీరు కొంత సౌలభ్యం కోసం ఎక్కువకాలం అప్పులో ఉండటానికి అంగీకరిస్తే, చివరికి బ్యాంకుకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే సమయంలో తక్కువ EMI ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ ఈ EMIలు సాధారణంగా ఎక్కువ కాలపరిమితితో వస్తాయి. ఉదాహరణకు రూ.10 లక్షల రుణాన్ని 10 శాతం వడ్డీతో 5 సంవత్సరాలకు తీసుకుంటే, EMI సుమారు రూ.21 వేలుగా ఉంటుంది, మొత్తం వడ్డీ సుమారు రూ.2.75 లక్షలు. అదే రుణాన్ని 10 సంవత్సరాలకు పొడిగిస్తే, EMI రూ.13 వేల వరకు తగ్గుతుంది. అయితే ఈ సందర్భంలో వడ్డీ భారం రూ.5.8 లక్షలకు పెరుగుతుంది. అంటే నెలకు చెల్లించే మొత్తం తగ్గినా, మొత్తం ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువవుతుంది.
ఇది ఎందుకు జరుగుతుందంటే, రుణ కాలపరిమితి పెరిగిన కొద్దీ అసలు మొత్తం చాలా నెమ్మదిగా తగ్గుతుంది. దీంతో బ్యాంకులు ఎక్కువ కాలం పాటు వడ్డీ వసూలు చేస్తాయి. ముఖ్యంగా గృహ రుణాల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 15 సంవత్సరాల రుణంతో పోలిస్తే 25 సంవత్సరాల రుణంలో EMI తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం చెల్లించాల్సిన వడ్డీ భారీగా పెరుగుతుంది. కొన్నిసార్లు అసలు రుణం కంటే ఎక్కువ వడ్డీ చెల్లించే పరిస్థితి కూడా వస్తుంది. అయితే దీర్ఘకాలిక రుణాలు పూర్తిగా తప్పు అనుకోవడం సరికాదు.
క్యాస్ ఫ్లో పరిమితంగా ఉన్నవారికి ఇవి ఉపయుక్తంగా ఉండవచ్చు. ముఖ్యంగా EMI వల్ల ఆదా అయ్యే మొత్తాన్ని సరైన పెట్టుబడుల్లో పెట్టగలిగితే, దీని వల్ల లాభం కూడా పొందవచ్చు. కానీ అలా చేయకుండా కేవలం ఖర్చులు పెంచితే, ఇది ఆర్థిక భారంగా మారుతుంది. అందుకే రుణం తీసుకునే ముందు కేవలం EMIపై కాకుండా, మొత్తం చెల్లించాల్సిన వడ్డీపై దృష్టి పెట్టడం చాలా అవసరం. చక్రవడ్డీ పెట్టుబడుల విషయంలో మిత్రుడైతే, రుణాల విషయంలో అదే పెద్ద శత్రువుగా మారుతుందని గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి